తమన్నా పాఠం ఏడో తరగతి టెక్స్ట్ బుక్‌లో... కర్ణాటకలో రాజుకున్న వివాదం

School Textbook: నటి తమన్నా భాటియా గురించి ఏడో తరగతి పాఠ్య పుస్తకంలో ఓ చాప్టర్ ను చేర్చడం వివాదం సృష్టించింది.

Update: 2024-06-28 08:04 GMT

తమన్నా పాఠం ఏడో తరగతి టెక్స్ట్ బుక్‌లో... కర్ణాటకలో రాజుకున్న వివాదం

School Textbook: నటి తమన్నా భాటియా గురించి ఏడో తరగతి పాఠ్య పుస్తకంలో ఓ చాప్టర్ ను చేర్చడం వివాదం సృష్టించింది. కర్ణాటక రాష్ట్రంలోని హెబ్బల్ ప్రైవేట్ స్కూల్‌పై విద్యార్థుల పేరేంట్స్ ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై స్కూల్ మేనేజ్మెంట్ సరిగా స్పందించనందునే చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ ను ఆశ్రయించినట్లు తల్లితండ్రులు చెప్పారు.


అసలు వివాదం ఏంటి?

కర్ణాటక హెబ్బల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఏడో తరగతి పాఠ్యపుస్తకంలో ‘లైఫ్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఆఫ్టర్ ది పార్టిషన్ ది సింధ్’ అనే పాఠం చేర్చారు. అందులో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత సింధ్ ప్రాంతంలోని పరిస్థితులు, వలసల గురించి వివరించారు.

1947 నుండి 1962 వరకు సింధ్ లో ఏ రకమైన పరిస్థితులు ఉండేవో ఆ పాఠంలో రాశారు. ఇందులో సింధ్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖుల జీవితాల గురించి రాశారు. వారిలో తమన్నాతో పాటు హిందీ నటుడు రణవీర్ సింగ్ గురించి కూడా ప్రస్తావించారు.

రణవీర్ సింగ్ పేరును పాఠ్యాంశంలో చేర్చడాన్ని పేరేంట్స్ తప్పుబట్టడం లేదు. కానీ, తమన్నామీద చాప్టర్ ను చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ లో తమన్నా భాటియా కోసం సెర్చ్ చేస్తే ఆమె హాట్ పిక్చర్స్, బోల్డ్ సీన్స్ వీడియోలు దర్శనమిస్తున్నాయని వారు చెబుతున్నారు. ఇలాంటి వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమన్నా భాటియా చాఫ్టర్ ను పాఠ్యాంశంలోంచి తీసేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తమన్నా భాటియా వివాదంపై చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ కు ఫిర్యాదు

తమన్నా భాటియా చాఫ్టర్ ను ఏడో తరగతి పాఠ్యాశంలో చేర్చడంపై పేరేంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కొందరు పేరేంట్స్ స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. కానీ, వారి నుండి సరైన స్పందన రాలేదని చెబుతున్నారు. అంతేకాదు, దీనిపై ప్రశ్నిస్తే తమ పిల్లలకు టీసీలిచ్చి స్కూలు నుంచి పంపించేస్తామని బెదిరించారని కొందరు పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. తమన్నా భాటియా అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చడంపై కర్ణాటక చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ కు పేరేంట్స్ ఫిర్యాదు చేశారు.


తమన్నా పాఠ్యాంశంపై విచారణ

స్కూల్ టెక్స్ట్ బుక్స్‌లో ఏదైనా పాఠాన్ని చేర్చాలంటే ముందుగా విద్యాశాఖ బోర్డుల నుండి అనుమతి తీసుకోవాలి. కానీ, తమన్నా పాఠం విషయంలో అలాంటి అనుమతులు తీసుకున్నారా లేదా అన్నది అధికారులు ఆరా తీస్తున్నారు. అసోసియేటేడ్ మేనేజెమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ కర్ణాటకతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ విషయమై విచారణ ప్రారంభించారు.

తమన్నా నటించిన కొన్ని చిత్రాలు ఏడవ తరగతి విద్యార్థులు చూడడం సరైనది కాదు కాబట్టి పేరెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఆమె గురించి సెర్చ్ చేస్తే అభ్యంతరకరమైన కంటెంట్ కనిపించే అవకాశం ఉంటుందని అసోసియేటెడ్ మేనేజ్మెంట్స్ ఆఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ ఇన్ కర్నాటక ప్రతినిధులు చెబుతున్నారు.

తమన్నా కచ్చితంగా ప్రముఖ నటి, సెలెబ్రిటీ. కానీ, ఆమె ఏం సాధించారని విద్యార్థులు ఆమె గురించి చదువుకోవాలి? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న రణ్‌వీర్ సింగ్‌కు కూడా వర్తిస్తుందని, తమన్నా పాఠానికి మాత్రమే అభ్యంతర వ్యక్తం చేయడమేమిటనే జెండర్ క్రిటిసిజమ్ కూడా మరోవైపు వినిపిస్తోంది.

Tags:    

Similar News