Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదులో నేటి నుంచి సర్వే
Gyanvapi Masjid: అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్వే చేయనున్న అధికారులు
Gyanvapi Masjid: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే ఇవాళ ప్రారంభం కానుంది. అలహాబాద్ హైకోర్టు సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ అధికారులు సర్వే మొదలుపెట్టనున్నారు. జ్ఞానవాపి మసీదులో సర్వే చేపట్టాలంటూ గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై.. అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. దీంతో అలహాబాద్ హైకోర్టులో అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ పిటిషన్ వేసింది.
వాదనలు విన్న అనంతరం మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది ధర్మాసనం. జిల్లా కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. అయితే సర్వే వెంటనే ప్రారంభించుకోవచ్చన్న ధర్మాసనం.. సర్వే సమయంలో మసీదులో తవ్వకాలు చేయొద్దని తెలిపింది. దీంతో ఇవాళ్టి నుంచి సర్వే నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఏఎస్‌ఐ అధికారులు. ఇక సర్వే నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు అలహాబాద్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వే నిలుపుదల కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.