Top 6 News @ 6PM: లగచర్ల దాడి ఘటనలో కీలక పరిణామం.. తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు

Update: 2024-12-06 12:43 GMT

1) Supreme court verdict on TGSPSC Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కుదరదు: సుప్రీంకోర్టు సంచల తీర్పు

Supreme Court: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలని దాఖలై పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఈ నోటిఫికేషన్ రద్దు కుదరని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. 2022 గ్రూప్ -1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2024 గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని మెయిన్స్‌ను వాయిదా వేయాలని అభ్యర్ధులు కోరారు.

అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. జస్టిస్ పి.ఎల్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్ధులు ఎవరూ ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) Lagacherla Attack: పట్నం నరేందర్ రెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీ

Lagacherla Attack: పట్నం నరేందర్ రెడ్డిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి శుక్రవారం కొడంగల్ కోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. లగచర్ల దాడి కేసులో అరెస్టైన పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నారు. డిసెంబర్ 7, 8 తేదీల్లో నరేందర్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు.

దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుపై లగచర్ల-దుద్యాల గ్రామాల మధ్య ఈ ఏడాది నవంబర్ 11న ప్రజాభిప్రాయసేకరణ ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రజాభిప్రాయసేకరణకు ప్రజలు హాజరుకాలేదు. బీఆర్ఎస్ నాయకులు బి.సురేష్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వద్దకు వెళ్లి లగచర్ల గ్రామానికి వచ్చి స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని కోరారు. సురేశ్ మాటలతో లగచర్లకు వెళ్లిన కలెక్టర్ సహా జిల్లా ఉన్నతాధికారులపై గ్రామస్తులు దాడికి యత్నించారు. అయితే పోలీసులు వారిని రక్షించారు. ఆ ఘటనలో కడా అధికారి వెంకట్ రెడ్డిని స్థానికులు కొట్టారు. ఈ ఘటనలో సురేశ్ , పట్నం నరేందర్ రెడ్డి సహా సుమారు 20 మందిని అరెస్ట్ చేశారు.

3) PDS Rice Smuggling: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు

PDS Rice Smuggling: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విచారణ జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ వినీత్ బ్రిజ్ లాల్ చీఫ్ గా ఆరుగురు సభ్యులతో సెట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సిట్ సభ్యులుగా సీఐడీ ఎస్పీ ఉమా మహేశ్వర్, డీఎస్పీలు ఆశోక్ వర్ధన్, గోవిందరావు, బాలసందర్ రావు, రత్తయ్యను నియమించారు. ప్రతి 15 రోజులకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సిట్ కు పూర్తిస్థాయి అధికారాలను ప్రభుత్వం కల్పించింది. బియ్యం రవాణా కేసులను సిట్ విచారించనుంది.

కాకినాడ పోర్టులో 1,064 టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది.ఈ బియ్యం తరలిస్తున్న నౌకను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ నౌకను సీజ్ చేయాలని ఆదేశించారు. కాకినాడలో పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై 13 కేసులు నమోదయ్యాయి. బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు సంస్థలన్నీ కూడా సిట్ కు సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

4) ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్.. పవన్‌ కళ్యాణ్‌ సీఎం కావాలంటూ..!

MP Vijayasai Reddy tweet on Pawan Kalyan: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ లో చేసిన పోస్ట్ దుమారం రేగుతుంది. ఎన్డీయే నేతల మధ్య గొడవ పెట్టేలా విజయ సాయి ట్వీట్ చేశారు. ఏపీకి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలని యంగ్ ఏపీని యంగ్ లీడర్ అయితేనే సమర్థవంతంగా లీడ్ చేయగలరన్నారు. వయస్సు, దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఏపీకి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలన్నారు. 75 ఏళ్ల వయస్సులో సమర్థవంతంగా చంద్రబాబు పనిచేయలేరన్నారు.

కాకినాడ పోర్టు విషయంలో విచారణ చేపట్టకుండానే లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తానన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అన్యాయం జరిగితే నాలుగున్నరేళ్ల నుంచి కేవీ రావు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు రాగానే ఫిర్యాదు చేయడం వెనక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కేవీ రావు చంద్రబాబు మనిషని ఆక్షేపించారు. 2020మేలో కేవీరావుకు ఫోన్ చేశానని... కాకినాడ పోర్టుపై విక్రాంత్‌తో మాట్లాడానని చెప్పేందుకు ఆధారాలున్నాయా అని అడిగారు విజయసాయి రెడ్డి.

5) Farmers Protests: ఢిల్లీ-హర్యానా బార్డర్‌లో ఉద్రిక్త పరిస్థితి.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం

Farmers marching to Delhi leads to hgh tension at Delhi - Haryana border: ఛలో ఢిల్లీ పేరుతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు చేపట్టిన ఆందోళనతో ఢిల్లీ - హర్యానా బార్డర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా హర్యానాలోని అంబాల జిల్లా నుండి ఢిల్లీకి దారితీసే శంభు బార్డర్ వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు రైతులు ఢిల్లీ వైపు పాదయాత్ర చేపట్టారు. కానీ వారిని అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు కూడా భారీ బందోబస్తుతో గట్టి ఏర్పాట్లు చేశారు.

శంభు బార్డర్ వద్ద పెద్ద పెద్ద ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున బారీకేడ్స్ పెట్టారు. ఇవే కాకుండా ఎత్తైన సిమెంట్ దిమ్మెలు కూడా అడ్డంగా పెట్టారు. ఇవన్నీ దాటుకుని వచ్చే వారిని అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. అయినప్పటికీ, శంభు బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ బారికేడ్స్‌ని రైతులు పడదోసుకుని ఢిల్లీ వైపు ముందుకు వెళ్లారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇనుప కంచెలు దాటుకుని వెళ్లిన రైతులు సిమెంట్ దిమ్మెలు లాంటి జెర్సీ బారీకేడ్స్ వద్ద ఆగిపోయారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) IND vs AUS 2nd test match: ఇండియా vs ఆస్ట్రేలియా పింక్ టెస్ట్ మ్యాచ్‌లో చెలరేగిపోయిన మిచెల్ స్టార్క్

IND vs AUS 2nd test match: ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నేడు రెండో టెస్ట్ మ్యాచ్ మొదలైంది. అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసిస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో చెలరేగిపోయాడు. దీంతో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే చాప చుట్టేసింది. నితీష్ కుమార్ రెడ్డి 54 బంతుల్లో 42 పరుగులతో ఇచ్చిన పర్‌పార్మెన్స్‌ టీమిండియా ఆ మాత్రం స్కోర్ అందుకునేలా చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 33 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి 86 పరుగులు చేసింది. 

Tags:    

Similar News