Supreme Court: మెడికల్ సీట్ల వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు
Supreme Court: 1,456 సీట్లు ఖాళీగా ఉండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court: మెడికల్ సీట్ల వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. మెడికల్ సీట్ల విషయంలో ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని సుప్రీం మండిపడింది. 2021-22 విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. మిగిలిన మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌పై ఇవాళ సుప్రీంకోర్టు కీలక ప్రకటన చేయనుంది.
నీట్-పీజీ-2021లో 1,456 సీట్లను భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇన్ని సీట్లు ఖాళీగా ఎందుకు ఉండాల్సి వచ్చిందని నిలదీసింది. ఇలా చేయడం వైద్య విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, దేశంలో వైద్యుల కొరతను మరింత పెంచడంతోపాటు, అవినీతిని సైతం ప్రోత్సహించడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వ్యవహరించిన తీరుపై నిప్పులు చెరిగింది. కటాఫ్ డేట్ సమయానికి ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో.. ఎన్ని అడ్మిషన్లు కల్పించారో లెక్కాపత్రం ఉండాలని సూచించింది. విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వని పక్షంలో అందుకు బాధ్యులైన వారి నుంచి పరిహారం ఇచ్చేలా తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.