Sachin Pilot Case Updates: సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. గెహ్లాట్ సర్కారుకు షాక్..
Supreme Court Refuses to Stay on Sachin Pilot Camp: రాజస్థాన్ లో రాజకీయాలు రోజుకోవిధంగా మలుపు తిరుగుతున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల పిటిషన్ల విషయంలో ఉత్తర్వులు జారీ చేయకుండా రాజస్తాన్ హైకోర్టును నిలువరించలేమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై విచారణను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదలాయించాలని రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. అలాగే ప్రజాస్వామ్యంలో అసమ్మతి స్వరాలను అణిచివేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వాయిదా వేయాలన్న హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది.
సుప్రీం కోర్టు గురువారం ఉదయం 11 గంటలకు దీనిపై విచారణ జరిపి పైవిధంగా ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు పైలట్ సహా 19 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసుల జారీకి కారణాలను చెప్పాలని రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీని వివరణ కోరింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, బిఆర్ గవై, కృష్ణ మురారీల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. రాజ్యాంగంలోని 10 వ షెడ్యూల్ కింద స్పీకర్ చేపట్టిన అనర్హత చర్యలను హైకోర్టు అడ్డుకోలేదని ఆరోపిస్తూ స్పీకర్ సిపి జోషి పిటిషన్ లో పేర్కొన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో పాటు సొంత ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నారని స్పీకర్ జోషి తరపున కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.