Air Pollution: ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న పొల్యూషన్

* వరల్డ్ టాప్-10 కాలుష్య నగరాల్లో ఢిల్లీకి చోటు * ఇళ్లలో కూడా మాస్క్‌లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు

Update: 2021-11-15 02:41 GMT

ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న పొల్యూషన్(ఫైల్ ఫోటో)

Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం మనుషుల్లో తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తోంది. వాతావరణ మార్పులకూ కారణభూతమవుతోంది. వాయు కాలుష్యం ఏటా ప్రపంచ వ్యాప్తంగా 88 లక్షల మంది మరణాలకు దారితీస్తున్నట్లు అంచనా.

ధూమపానం కంటే వాయు కాలుష్యం వల్లే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. వాయు కాలుష్యం మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని, కణాన్ని దెబ్బతీస్తుంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, మనోవైకల్యం, ఎముకలు పెలుసుబారడం వంటి అనేక సమస్యలకు దారి తీస్తుందంటున్నారు.

ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర రీతిలో పెచ్చరిల్లింది. అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందంటూ సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం తీవ్రతకు నిదర్శనం. కాలుష్యాన్ని త్వరితగతిన నియంత్రించేందుకు వాహనాల రాకపోకలను నిలిపివేయడమో, రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడమో చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది.

దీపావళి ప్రభావంతో ఇటీవల భారత్‌లోని 23 నగరాల్లో వాయు నాణ్యత గణనీయంగా పడిపోయింది. బాణసంచా కాల్చడంవల్ల ఉత్పన్నమైన అదనపు కాలుష్యంతో గాలి నాణ్యత క్షీణించినట్లు సీపీసీబీ పేర్కొంది.

ఢిల్లీలో విపరీతంగా టపాసులు కాల్చడం సమస్య తీవ్రతను పెంచింది. పంజాబ్‌, హరియాణాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటివి సైతం కాలుష్య కారకాలే. ఫరీదాబాద్‌, గుడ్‌గావ్‌, ఘజియాబాద్‌, నొయిడా తదితర నగరాల్లోనూ వాయు నాణ్యత క్షీణించింది.

హైదరాబాద్‌లో రెండేళ్ల తరవాత వాయు కాలుష్యం గరిష్ఠస్థాయికి చేరిందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. డబ్ల్యూఏక్యూఐ ప్రకారం దీపావళి రోజు రాత్రి హైదరాబాద్‌లో పీఎం2.5 స్థాయి 384కు చేరింది. గత సంవత్సరం కొవిడ్‌ వ్యాప్తి అధికంగా ఉండటంతో దీపావళి బాణసంచా అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.

ఈ ఏడాది బాణసంచా వినియోగం పెరగడం పలు నగరాల్లో గాలి నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపింది. 2020లో పీఎం2.5 ఢిల్లీలో 16.8 రెట్లు, ముంబయిలో ఎనిమిది రెట్లు, కోల్‌కతాలో 9.4, చెన్నైలో 5.4, హైదరాబాద్‌లో 7, అహ్మదాబాద్‌లో 9.8 రెట్లకంటే ఎక్కువగా ఉంది.

Tags:    

Similar News