Maharashtra Poliical Crisis: షిండే వర్గానికి ఊరట.. డిప్యూటీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
* శివసేన రెబల్ ఎమ్మెల్యేల పిటీషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
Maharashtra Political Crisis: మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, డిప్యూటీ స్పీకర్ నోటీసులపై సుప్రీంకోర్టు ఉన్నపళంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇరువురి వాదనలు వినడానికి ఇద్దరికీ సమయం ఇచ్చింది. రెబల్ ఎమ్మెల్యేలు ఎమర్జెన్సీ హియరింగ్ కోసం రిక్వెస్టు చేసుకున్న మీదట ఇవాళ సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి, శివసేన శాసనసభాపక్ష నేతకు, చీఫ్ విప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తదుపరి విచారణ వరకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన నోటీసులపై స్టే విధించడంతో రెబల్స్ కు ఊరట కల్పించినట్లయింది. డిప్యూటీ స్పీకర్ నోటీసుపై జులై 12 వరకు రెబల్ ఎమ్మెల్యేలకు సమయం చిక్కింది. మరోవైపు తమకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నుంచి బెదిరింపులు వస్తున్నాయని రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో వారితోపాటు వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు తాజా నిర్ణయంతో రెబల్ ఎమ్మెల్యేలు తాజా వ్యూహం ఖరారు చేసుకోవడానికి సమయం చిక్కినట్లయింది.