Supreme Court: లఖీంపూర్‌ఖేరి ఘటనపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
* యూపీ ప్రభుత్వాన్ని స్టేటస్ నివేదికను కోరిన ధర్మాసనం * ఘటనపై సిట్ ఏర్పాటు చేశామని తెలిపిన యూపీ సర్కార్
Supreme Court: దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. నిన్న జరిగిన విచారణలో ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసులో నిందితులపై దాఖలైన ఎఫ్‌ఐఆర్, అరెస్ట్‌లపై స్టేటస్ నివేదిక కోరింది. ఈ ఘటనపై దర్యాప్తునకు హైకోర్టు మాజీ న్యాయమూర్తితో ఏకసభ్య కమిటీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కౌన్సెల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దీంతో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది.
ఇక లఖింపూర్‌లో కేంద్ర మంత్రి కాన్వాయ్ రైతులపైకి దూసుకెళ్లిన ఘటన సంచలనమైంది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు యూపీ పోలీసులు సమన్లు జారీ చేశారు. హింసాత్మక ఘటనలో విచారణకు హాజరుకావాలని సమన్లలో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఐజీ రేంజ్ లక్ష్మీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటనకు సంబంధించి చాలా ఆధారాలు లభించాయని, ఇద్దరిని విచారిస్తున్నామన్నారు.