రైతుల ట్రాక్టర్ ర్యాలీ విషయంపై రేపు సుప్రీంకోర్టు విచారణ
*గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతుల ర్యాలీ
ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టనున్న ట్రాక్టర్ ర్యాలీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రేపు విచారణ జరుపనున్నది. రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు భంగం కలిగించడానికి చేపట్టే ఏదైనా ప్రతిపాదిత ర్యాలీ లేదా నిరసన దేశానికి అపఖ్యాతిని కలిగిస్తుందని ఢిల్లీ పోలీసుల ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో కేంద్రం పేర్కొంది. ట్రాక్టర్ మార్చ్, ట్రాలీ మార్చ్, వెహికల్ మార్చ్ లేదా మరే ఇతర రూపంలోనైనా ఎవరైనా నిరసన ర్యాలీ నిర్వహించకుండా నిరోధించాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది.
ఈ పిటిషన్‌పై ఈ నెల 18న విచారణ జరుపుతామని ఈ నెల 12న సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్రం పిటిషన్‌పై స్పందన తెలపాలని రైతు సంఘం నేతలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం పిటిషన్‌తోపాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌కే బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపనుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రేపు మరోసారి రైతు సంఘాల నేతలతో చర్చలు జరుపనుంది.