రాజద్రోహం చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు
Sedition Law: రాజద్రోహం కింద జైలుకు వెళ్లిన వారు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం
Sedition Law: రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 124ఏ చట్టాన్ని పునర్ పరిశీలిస్తున్నామని కేంద్రం తెలిపడంతో అప్పటివరకు దాని అమలును నిలిపేస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కొత్తగా కేసులు నమోదు చేయరాదని.. ఈ చట్టం కింద అరెస్టయి జైలుకు వెళ్లినవారు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ తేల్చి చెప్పారు.
ఇప్పటివరకు నమోదు చేసిన కేసులన్నింటినీ పెండింగ్‌లో ఉంటాయన్నారు. హనుమాన్ చాలీసా కేసులో రాజద్రోహం చట్టాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసినట్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. తాజాగా ఈ చట్టం కింద కేసులు నమోదైతే బాధితులు కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. సెక్షన్ 124 ఏ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి రాష్ట్రాలకు తగిన ఆదేశాలు జారీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని సీజేఐ స్పష్టం చేశారు.
బ్రిటిష్ వలస కాలం నుంచి అమల్లో ఉన్న సెక్షన్ 124ఏ చట్టాన్ని పునఃసమీక్షిస్తారా? ఆ చట్టం కింద కేసులు నమోదైన పౌరుల ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా అప్పటిదాకా పెండింగ్ కేసులన్నింటినీ పక్కన పెడతారా? పునఃసమీక్ష పూర్తయ్యేదాకా దేశద్రోహం కింద కొత్త కేసులు పెట్టకుండా ఉంటారా?'' అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిందిగా సూచించింది.
అయితే రాజద్రోహం చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఆ చట్టాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు సుప్రీం తాజా తీర్పులో ప్రకటించింది. ఈ చట్టాన్ని సమీక్షించే వరకూ స్టే విధిస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే దీనిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల సభను కోర్టులు గౌరవించాలన్నారు. తమకు రాజద్రోహ చట్టంపై స్పష్టమైన హద్దులు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. లక్ష్మణ రేఖను ఎవరూ దాటకూడదని స్ఫస్టం చేశారు.