Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ
*లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపిన ఢిల్లీ ప్రభుత్వం
Supreme Court: ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ సర్కార్ సమర్పించిన అఫిడవిట్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ కుంటిసాకులు చెపుతోందని జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్యనించారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చెత్తను తగులబెట్టడమే కాకుండా రవాణా, పరిశ్రమలు, వాహనాల రాకపోకలే వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని సుప్రీంకోర్టు నిర్ధారించింది.
కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సర్కార్‌తో కలిసి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి రేపటి సాయంత్రంలోగా కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది. ఏయే పరిశ్రమలను ఆపవచ్చు, ఏ వాహనాలను నడపకుండా నిరోధించవచ్చు, ప్రత్యామ్నాయ విద్యుత్‌ను ఎలా అందించాలనే దానిపై రేపు సాయంత్రంలోగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని సుప్రీంకోర్టు కోరింది. అటు కాలుష్యంపై ఢిల్లీ మున్సిపల్ కమిషనర్‌కు చురకలు అంటించింది.
ఇక కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలపై సొలిసిటర్ జనరల్ అఫిడవిట్‌ను కోర్టుకు అందజేశారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలియజేసింది. పొరుగు రాష్ట్రాల్లోని ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్ అమలు చేస్తే అర్ధవంతంగా ఉంటుందని కోర్టుకు తెలియజేసింది.