Supreme Court: నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సోమవారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ ప్రవేశ పరీక్షలను నిర్వహించరాదు అని 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు సుప్రీంలో పిటిషన్ వేశారు. విద్యార్థులు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు సుప్రీం చెప్పింది.
జస్టిస్ అరుణ్ మిశ్రా, బీఆర్ గవాయి, కృష్ణమురారీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. 'కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందే. మరో ఏడాది కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవచ్చు. ఇప్పుడు వైరస్ భయాలతో పరీక్షలు వాయిదా వేస్తే వచ్చే ఏడాది కూడా అలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చు. అప్పుడు కూడా వాయిదా వేస్తారా?'అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.