మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు ఎదురు దెబ్బ
Supreme Court: మహారాష్ట్ర ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది.
Supreme Court: మహారాష్ట్ర ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల ఏడాది సస్పెన్షన్‌ను కొట్టేసింది. ఈ కాలంలో ఎమ్మెల్యేలు కోల్పోయిన జీత భత్యాలు, ప్రయోజనాలను ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాజ్యాంగం ప్రకారం.. అసెంబ్లీ స్థానం ఆరు నెలల కంటే ఎక్కువ సమయం ఖాళీగా ఉండరాదని అలాంటిది ఏడాది పాటు ఎలా సస్పెండ్ చేస్తారని సుప్రీం నిలదీసింది. ఏడాది పాటు సభ్యుడిని సస్పెండ్ చేయడమంటే ఆ నియోజకవర్గ ప్రజలను శిక్షించడమేనని మండిపడింది.
ఎమ్మెల్యేలను సస్సెండ్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్ట విరుద్ధమని, ద్వేషపూరిత చర్య అని పేర్కొంటూ అసెంబ్లీ తీర్మానాన్ని సుప్రీం కొట్టివేసింది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం 60 రోజులకు మించి సస్పెండ్ చేయకూడదని సుప్రీం స్పష్టం చేసింది. రాజ్యంగంలోని అర్టికల్ 190 - 4 ప్రకారం అనుమతి లేకుండా 60 రోజులకు మించి సభకు హాజరు కాపోతే ఆ స్థానం ఖాళీ అయినట్టుగా ప్రకటిస్తారు.
అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారని గతేడాది జూలైలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు. తాజా తీర్పు నేపథ్యంలో ఉద్దవ్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు.