Sputnik-V: భారత్‌లో అందుబాటులోకి మరో కోవిడ్ వ్యాక్సిన్
Sputnik-V: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
Sputnik-V: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షన్నర దాటుతోంది. ఇవాళ కొత్తగా లక్షా 68వేల 975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు కోటి 35లక్షల 27వేల 780కి చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనాతో 964 మంది మృతి చెందారు.
భారత్ నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దేశ ప్రజలకు వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. మరోవైపు వ్యాక్సిన్ల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం భారత్‌లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉండగా ఇప్పుడు, మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్-వి' టీకాకు కేంద్రం ఓకే చెప్పింది. భారత్‌లో అత్యవసర వినియోగానికి స్పుత్నిక్-వి టీకాకు కేంద్ర నిపుణుల కమిటీ అనుమతినిచ్చింది. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్ అభివృద్ధి చేసిన ఈ టీకాను, భారత్‌లో ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది. 'స్పుత్నిక్ వి' టీకాపై మనదేశంలో రెండు, మూడో దశ క్లినికల్ పరీక్షలను ఇటీవలే ఆ సంస్థ నిర్వహించింది. స్పుత్నిక్-వి సక్సెస్ రేట్ 91.6 శాతంగా నమోదైంది. దీంతో స్పుత్నిక్-వి రాకతో కొద్ది రోజుల్లోనే దేశంలో వ్యాక్సిన్ కొరత తీరనుంది.