Southwest Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
Southwest Monsoon: రెండు రోజుల ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు
Southwest Monsoon: భారత వాతావరణ విభాగం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతు పవనాలు కేరళను తాకినట్లు ఐఎండీ ప్రకటించింది. ఈ మేరకు రుతుపవనాలు కేరళ దక్షిణ ప్రాంతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ రుతుపవనాల ఆగమనంతో దేశంలో వర్షాకాలం మొదలైనట్లు అవుతుంది. ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.
వాస్తవానికి జూన్ 1నే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెండు రోజులు ఆలస్యంగా కేరళను తాకాయి. దీంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మన దేశంలో దాదాపు సగం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు వర్షాధారమైనవే. ప్రధానంగా నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి పంటలు పండిస్తారు. గత రెండేళ్లుగా దేశంలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే ఉందని వాతావరణ శాఖ తెలిపింది.