ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్న సోనియా గాంధీ

Sonia Gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాను ప్రశ్నించనున్న ఈడీ

Update: 2022-07-27 04:06 GMT

ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్న సోనియా గాంధీ

Sonia Gandhi: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఇవాళ మరోసారి సోనియాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదిలా ఉంటే నిన్న ఆరుగంటలకు పైగా ఈడీ ప్రశ్నలను ఎదుర్కొన్నారు సోనియా. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పలు అంశాలపై ప్రశ్నించిన అధికారులు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక, యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ వ్యవహారాల్లో సోనియా పాత్రపై ఆరా తీశారు. సోనియా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే గత గురువారం ఈడీ సోనియాను ప్రశ్నించింది. ఆ సమయంలో ఆమెకు 20కి పైగా ప్రశ్నలు సంధించారు అధికారులు. ఇక ఇదే కేసులో గతంలో రాహుల్‌ను కూడా ఈడీ అధికారులు 5రోజుల పాటు ప్రశ్నించారు.

నిన్న ఉదయం రాహుల్‌, ప్రియాంకలతో కలిసి సోనియా గాంధీ ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. సోనియా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆమె వెంట కుమార్తె ప్రియాంక ఉండేందుకు ఈడీ అనుమతిచ్చింది. అయితే సోనియాను విచారించే గదిలో కాకుండా మరో గదిలో ఉండాలని అధికారులు ప్రియాంకకు సూచించారు. ఉదయం 11 గంటలకు సోనియా ఈడీ విచారణ ప్రారంభం కాగా దాదాపు 3 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు భోజన విరామం ఇచ్చారు. మళ్లీ మూడున్నర గంటలకు విచారణ ప్రారంభించి దాదాపు మరో 3 గంటల పాటు పలు అంశాలపై సోనియాను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు విచారణను ముగించిన అధికారులు సోనియా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. తిరిగి ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు సోనియాకు సూచించారు.

ఇక సోనియా ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలకు పిలుపునిచ్చింది. సోనియా, ప్రియాంక గాంధీలను ఈడీ ఆఫీస్‌ వద్ద దింపిన రాహుల్ ఈడీ చర్యకు వ్యతిరేకంగా విజయ్‌ చౌక్‌లో కాంగ్రెస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్‌ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా కాస్త ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారత్‌లో పోలీస్‌ రాజ్యం ఉందని, మోడీ ఓ రాజు అని రాహుల్‌ మండిపడ్డారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. సోనియా నివాస ప్రాంతం నుంచి ఈడీ ఆఫీస్‌ వైపు సుమారు కిలోమీటర్‌ పొడవున బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు సోనియా ఇంటి వద్ద, ఈడీ కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. 

Tags:    

Similar News