Sonia Gandhi to continue as President: మరోసారి కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగనున్న సోనియా..ఆర్నెళ్ల లోపు నూతన సారధి ఎన్నిక!
Sonia Gandhi to continue as President: నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశమైన సీడబ్ల్యూసీ భేటీ. ఎంతకీ ఆ సమస్యలపై ఓ స్పష్టత రాలేక పోవడంతో.. మరో సారి సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని సీనియర్ నేతలు ఒత్తిడి తీసుకువచ్చారు
Sonia Gandhi to continue as President: నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశమైన సీడబ్ల్యూసీ భేటీ. ఎంతకీ ఆ సమస్యలపై ఓ స్పష్టత రాలేక పోవడంతో.. మరో సారి సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని సీనియర్ నేతలు ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆమె నూతన అధ్యక్షుడి ఎంపిక జరిగేవరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. సోమవారం నాడు సమావేశమైన సీడబ్ల్యూసీలో ప్రధానంగా గాంధీయేత కుటుంబానికి చెందిన వ్యక్తికి సారధ్య బాధ్యతలు కట్టబెట్టాలని సోనియా కుటుంబం భావించగా, అందుకు నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మరోవైపు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని 23 మంది పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీకి లేఖరాసిన నేపథ్యంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం వాడివేడిగా సాగింది. ఈసమావేశం
దాదాపు ఏడు గంటల పాటు అనేక ట్వీస్ట్‌తో ముగిసింది. ఇందులో ముఖ్యంగా సోనియా గాంధీనే చీఫ్‌గా కొనసాగాలని సీనియర్ నేతలు మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీలు డిమాండ్‌చేయడం. భవిష్యత్తులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సీనియర్లను కట్టడిచేయడంలో, ఇప్పుడు లేఖ రాసిన వారిచే తాము లేఖ రాయడం తప్పని ఒప్పించడంలో సోనియా గాంధీ సఫలీకృతమయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో సారధ్య బాధ్యతలను ఎవ్వరికి అప్పజేప్పలనేది సత్వర నిర్ణయం వెలువడుతుందని ఆశించరాదని, పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు, ఎంపికకు సమయం పడుతుందని తెలిపాయి. ఆరు నెలల్లో తదుపరి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందని తెలిపాయి. లేఖ వ్యవహారంపై చెలరేగిన రచ్చ కూడా కొత్త నాయకుడి ఎంపిక ప్రక్రియకు ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది.
సీనియర్ నేతల తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం:
ఇక అంతకుముందు సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్ నేతల తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రోద్భలంతోనే సీనియర్లు లేఖ రాశారని ఆగ్రహం వ్వక్తంచేశారు. కపిల్ సిబల్, ఆజాద్ వంటి సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నేతలను అనునయించేందుకు స్వయంగా రాహుల్ వివరణ ఇచ్చారు. తాను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.
మరోవైపు పార్టీ నాయకత్వపై సోనియా గాంధీకి లేఖ రాసిన వారిపై పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నేత అంబికా సోనీ కోరగా, తాము పార్టీ పరిధికి లోబడే ఆయా అంశాలను లేవనెత్తామని గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ పేర్కొన్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంఘనే అని భావిస్తే తమపై చర్యలు చేపట్టవచ్చని అన్నారు. కాగా పార్టీ యువనేతలతో పాటు పలువురు సీనియర్ నేతలు, పార్టీ ముఖ్యమంత్రులు తాజా పరిణామాల నేపథ్యంలో గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అభిప్రాయాలు వెల్లడించారు. మొత్తం 52 మంది హాజరయ్యారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని వర్కింగ్ కమిటీ సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసారు. పార్టీని బలహీన పరిచే చర్యలకు ఎవ్వరు పాల్పడిన సహించేది లేదని వర్కింగ్ కమిటీ అభిప్రాయపడింది. అంతర్గత పార్టీ సమస్యలను మీడియా ద్వారా లేదా ప్రజా వేదికల ద్వారా చర్చించలేమని సిడబ్ల్యుసి పేర్కొంది. పార్టీ వేదికలలో మాత్రమే ఇటువంటి సమస్యలను లేవనెత్తాలని సిడబ్ల్యుసి సంబంధిత వారందరినీ కోరుతోంది. పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకునే నిర్ణయాధికారాన్ని సోనియాగాంధికి అప్పగిస్తూ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో పార్టీని మరియు దాని నాయకత్వాన్ని అణగదొక్కడానికి లేదా బలహీనపరచడానికి ఎవ్వరూ ప్రయత్నించినా అనుమతించేది లేదని సిడబ్ల్యుసి స్పష్టం చేస్తుంది. ఈ రోజు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త & నాయకుడి బాధ్యత భారత ప్రజాస్వామ్యం, వైవిధ్యంపై మోడీ ప్రభుత్వం చేత జరుగుతున్న హానికరమైన దాడిని ఎదుర్కోవడం అని వర్కింగ్ కమిటీ అభిప్రాయపడింది.
సిడబ్ల్యుసి సమావేశంలో తన ముగింపు వ్యాఖ్యలలో సోనియా గాంధీ మాట్లాడుతూ, "మనము ఒక పెద్ద కుటుంబం, మనలో చాలా సందర్భాలలో విభేదాలు ఉంటాయి, కానీ చివరికి మనము ఒకటిగా కలిసిపోతాము. ప్రజలు మరియు వారి ప్రయోజనం కోసం పోరాడటం అవసరం, వారి ప్రయోజనాలను కాపాడటంలో ఈ దేశ నాయకత్వం విఫలమవుతోంది " అని అభిప్రాయపడ్డారు.