Soil Pile On Tracks: రైలు పట్టాలపై మట్టి కుప్ప.. యూపీలోనే తరచుగా వెలుగుచూస్తున్న కుట్రలు

Update: 2024-10-07 14:23 GMT

Soil Pile On Railway Tracks: రైలు పట్టాలపై ఎల్పీజి సిలిండర్లు పెట్టడం, సిమెంట్ దిమ్మెలు పడేయడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణమయ్యాయి. రెండు రోజుల క్రితం రైలు పట్టాలపైకి కారు రావడం కూడా వార్తల్లో చూశాం. తాజాగా రైలు పట్టాలపై గుర్తుతెలియని దుండగులు మట్టి కుప్పను పోసిన ఘటన మరోసారి రైలు ప్రయాణాల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలికి సమీపంలోని రఘురాజ్ సింగ్ స్టేషన్ కి సమీపంలో ఆదివారం జరిగిన ఈ ఘటన రైలు ప్రయాణికులకు షాక్ ఇచ్చింది.

రైలు పట్టాలపై మట్టి కుప్ప పోసి ఉండటాన్ని దగ్గరిగా గమనించిన రైలు లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి రైలుని నిలిపేశాడు. లోకో పైలట్ ఇచ్చిన ఫిర్యాదుతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే రైలు పట్టాలపై పోసి ఉన్న మట్టి కుప్పను అక్కడి నుండి తొలగించి రైళ్ల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు.

స్థానిక ఎస్ హెచ్ఓ దేవేంద్ర భదోరియా మాట్లాడుతూ.. రైలు పట్టాలపై మట్టి కుప్పను తొలగించామని అన్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇక్కడ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయని, రాత్రివేళల్లో టిప్పర్లు మట్టి లోడ్లను తీసుకొస్తున్నాయని తెలిపారు. ఆ క్రమంలోనే ఎవరో గుర్తుతెలియని టిప్పర్ డ్రైవర్ ఎవ్వరూ చూడని సమయంలో అదే మట్టి లోడును ఇక్కడ పోసి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నట్లు దేవేంద్ర భదోరియా వెల్లడించారు. దర్యాప్తు చేపట్టిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని భదోరియా చెప్పారు.

ఏదేమైనా ఉత్తర్ ప్రదేశ్‌లో తరచుగా వెలుగుచూస్తున్న ఈ తరహా నేరాలు రైలు ప్రయాణికుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. రైలు పట్టాలపై ఎల్పీజి సిలిండర్లతో పాటు పెట్రోల్ బాటిల్ పెట్టడం, సిమెంట్ దిమ్మెలు పడేయటం వంటివి కుట్రల కిందకే వస్తాయని రైల్వే శాఖ అనుమానం వ్యక్తంచేస్తోంది. అదృష్టవశాత్తుగా అన్ని సందర్భాల్లోనూ లోకో పైలట్స్ అప్రమత్తంగా వ్యవహరించి, రైలుని వెంటనే నిలిపేయడం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు రైలు ప్రయాణికులు. 

Tags:    

Similar News