Delhi farmers: ఢిల్లీ రైతుల ఆందోళనలపై సోషల్ వార్
* రైతులకు మద్దతుగా అంతర్జాతీయ సెలబ్రిటీల ట్వీట్లు * ట్వీట్లపై ఎదురుదాడికి దిగిన కేంద్ర ప్రభుత్వం * 257 URL లింక్, హ్యాష్‌ట్యాగ్‌ను స్తంభింపజేయాలని ట్విట్టర్‌కు ఆదేశం
ఢిల్లీ రైతుల ఆందోళన అనూహ్య రీతిలో సోషల్ వార్‌కు తెరలేపింది. రైతులకు మద్దతుగా అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేయడంతో ఆందోళన ప్రపంచ వేదికలపైకి ఎగబాకింది. పాప్ స్టార్ రిహానా ట్వీట్‌తో మొదలైన దుమారం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సోదరి కుమార్తె మీనా హారిస్ ట్వీట్‌తో మరింత ముదిరింది.
సెలబ్రిటీల ట్వీట్లు వైరల్ కావడంతో కేంద్రం ఇబ్బందుల్లో పడింది. సంచలనాత్మకమైన హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టడం సరికాదని, కొన్ని రాజకీయ శక్తులు రైతుల ఆందోళనలను రెచ్చగొడుతున్నాయని, రైతుల ఆందోళనపై సంయమనంతో వ్యవహరిస్తున్నామని విదేశాంగ శాఖ వివరించింది.
ఢిల్లీ ఆందోళనకు సంబంధించి కేంద్రం 257 URL లింక్ లను, ఒక హ్యాష్‌ట్యాగ్‌ను స్తంభింపజేయాల్సిందిగా సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను వెంటనే అమలు పరిచినా 24 గంటలలోపే వీటిని పునరుద్ధరించింది ట్విట్టర్. ఆదేశాలను కొనసాగించలేమని స్పష్టం చేస్తూ సమాధానం పంపింది.
దీంతో ట్విట్టర్ పై కేంద్రం భగ్గుమంది. లింక్‌లను, హ్యాష్‌ట్యాగ్‌లను వెంటనే తొలగిస్తారా లేక చర్యలు తీసుకోమంటారా అని తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌కు 18 పేజీల నోటీసును సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ పంపింది. పునరుద్ధరించడానికి తాము అనుమతి ఇవ్వకముందే అన్‌బ్లాక్ చేశారని కేంద్రం లేఖలో తెలిపింది.
మరోవైపు కేంద్రానికి సపోర్ట్ చేస్తూ పలువురు ప్రముఖులు తమ ట్వీట్‌లతో ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా భారత ఐక్యతను దెబ్బతీయలేరని, భారత్ అత్యున్నత స్థాయికి చేరకుండా ఆపలేరని హోంమంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. దేశ భవితను ఈ ప్రతికూల ప్రచారాలు నిర్దేశించలేవని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ వాదనకు దన్నుగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ తారలు కంగన, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, కరణ్ జోహార్, సునీల్ శెట్టి ట్వీట్లు చేశారు. ఢిల్లీలో ఆందోళనలు చేస్తోంది రైతులు కాదని, ఉగ్రవాదులని కంగనా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది.