పడకగదిలో రోజూ బుస్సు.. బుస్సుమని శబ్దం.. ఎక్కడి నుంచి వస్తోందని చూస్తే అది ఏసీ నుంచి.. ఎందుకు ఆ శబ్దం వస్తోందో తెలీదు. ఏసీ ఆపేసి ఉన్నా శబ్దం వస్తోంది? ఏమైంది? మూడు నెలలు ఆ ఇంటివారిని వేధించిన ప్రశ్నలివి. దాంతో ఏసీ మెకానిక్ ను పిలిపించారు. అతడు వచ్చి ఏసీ విప్పి ఉలిక్కిపడ్డాడు. ఇక ఆ ఇంటి సభ్యులైతే భయంతో వణికిపోయారు. కారణం.. ఏసీలో పాము ఉంది.
తమిళనాడు రాష్ట్రం పుదుచ్చేరి జిల్లాలోని తెంగాయితిట్టు సాయిజీవా సరోజానగర్‌కు చెందిన ఎలుమలై ఇంట్లో జరిగిందీ సంఘటన. ఏసీ విప్పిన మెకానిక్ కు అందులో రెండు పాము కుబుసాలు, ఓ పాము కనిపించాయి. దీంతో హడలిపోయిన మెకానిక్ వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు రెండు గంటలపాటు శ్రమించి పామును బయటకు తీశారు. ఏసీకి అనుసంధానించే బయటి పైపును సరిగా మూయకపోవడం వల్ల పాము అందులోంచి లోపలికి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. పామును పట్టుకున్న అధికారులు దానిని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.