131 Rooms Govt School: ఢిల్లీలో అంతర్జాతీయ ప్రమాణాలతో అతిపెద్ద ప్రభుత్వ పాఠశాల

Update: 2024-11-14 16:54 GMT

131 Rooms Govt School in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ సర్కార్ తాజాగా అంతర్జాతీయ ప్రమాణాలతో అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించింది. విద్యా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకుంటున్న ఢిల్లీ సర్కారు, ఈ స్కూల్ నిర్మాణంతో తాము మరో ముందడుగు వేశామంటోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన అతి పెద్ద పాఠశాలను నిర్మించామని ఆప్ సర్కార్ చెబుతోంది. సరికొత్త హంగులతో సుందర్ నగరిలో ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ పాఠశాలను ఢిల్లీ సీఎం అతిశీ బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు.

బాలల దినోత్సవం రోజున ఈ పాఠశాలను విద్యార్థులకు అంకితం చేయడంపై సీఎం అతిశీ ఆనందం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆమె పాఠశాల ఫొటోలను పోస్ట్ చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో ఈ నూతన పాఠశాలను నిర్మించినట్టు తెలిపారు.

రోజూ రెండు షిఫ్టులలో పనిచేయనున్న ఈ పాఠశాలలో ఒకేసారి 7వేల మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని సీఎం అతిషి అన్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ స్కూల్లో 131 గదులు, 7 ల్యాబ్ లు, లైబ్రరీ, లెక్చర్ హాలు, లిఫ్ట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నట్లు అతిశీ వెల్లడించారు. ఇలాంటి పాఠశాలను అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే నిర్మించగలరని ఢిల్లీ ప్రజలకు తెలుసునన్నారు. విద్యా రంగంపై కృషి చేసే ప్రభుత్వాన్నే ప్రజలు మరోసారి ఎన్నుకొంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News