TOP 6 News Of 6PM: లగచర్లలో మరో 10 మంది అరెస్ట్.. ధనుష్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నయనతార
1) Kodangal Attack: లగచర్ల దాడిలో మరో 10 మంది అరెస్ట్
Kodangal Attack: లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో శనివారం మరో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 21కి చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బి. సురేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టయ్యారు. ఆయనను కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ జరగనుంది. మరో వైపు నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్ ను కేటాయించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు.
వికారాబాద్ కలెక్టరేట్ కు మహేష్ భగవత్ వికారాబాద్ కలెక్టరేట్ కు శాంతిభద్రతల ఏడీజీ మహేష్ భగవత్ చేరుకున్నారు. లగచర్ల ఘటనకు ముందు జరిగిన పరిస్థితులను ఆరా తీశారు. ఎలా దాడి జరిగింది, ఎందుకు దాడి జరిగిందనే విషయాలను ఆరా తీశారు.
2) Breaking News: చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడి కన్నుమూత
Nara Ramamurthy Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరులు రామ్మూర్తి నాయుడు శనివారం మరణించారు. ఆయనకు భార్య, రోహిత్, గిరిష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు రామ్మూర్తి చనిపోయారని వైద్యులు ప్రకటించారు. రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న లోకేష్ విజయవాడ నుండి హుటాహుటిన హైద్రాబాద్ చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు దిల్లీ నుంచి మహారాష్ట్ర వెళ్లాల్సి ఉండగా ఆయన అక్కడి ఎన్నికల ప్రచారం రద్దు చేసుకుని నేరుగా హైద్రాబాద్ వచ్చారు.
ఈ నెల 14న కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయనకు స్టంట్ వేశారు. ఈ సమస్యతో పాటు శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. ఇవాళ ఉదయం మరోసారి ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయింది. చికిత్స పొందుతూ ఆయన మరణించారు.రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు.1994 నుంచి 1999 వరకు చంద్రగిరి అసెంబ్లీ నుంచి గెలిచారు. 1999లో ఇదే స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఓడారు.2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్మూర్తి నాయుడు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.
ఇది కూడా చదవండి : Nara Rammurthy Naidu: చంద్రబాబుకు, తమ్ముడు రామ్మూర్తి నాయుడుకు మధ్య ఎందుకు దూరం పెరిగింది?
3) కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు : మహేష్ కుమార్ గౌడ్
గత పదేళ్లలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదు సరికదా కేవలం దోపిడీ మాత్రమే జరిగిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అధికారం కోల్పోయామనే బాధలో కేటీఆర్ ఏదిపడితే అది మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. అధికారం కోల్పోవడమే కాదు.. కనీసం ప్రతిపక్ష పార్టీగానూ బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాల కంటే ఈ ఏక్క ఏడాదిలోనే కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అసలే ఉండదని ఆయన పేర్కొన్నారు.
4) Fire Accident: యూపీ ఝాన్సీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 10 మంది చిన్నారుల సజీవదహనం
Jhansi Medical College: ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు వ్యాపించి 10 మంది చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలను గుర్తించిన చిన్నారుల పేరేంట్స్ తమ పిల్లలను తీసుకొని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. ఇలా బయటకు తీసుకురాలేని 10 మంది చిన్నారులు చనిపోయారు. మరో 16 మంది చిన్నారులు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 10:45 గంటలకు షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయని జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ కుమార్ చెప్పారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు.
5) Vivek Ramaswamy: అమెరికా ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు.. వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు కేటాయించింది. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అగ్రరాజ్య ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ మధ్యే ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ మారలాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో వివేక్ రామస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లక్షల మంది ఫెడరల్ బ్యూరోక్రాట్లను బ్యూరోక్రసీ నుంచి సామూహికంగా తొలగించే స్థాయిలో నేను, ఎలాన్ మస్క్ ఉన్నాము. అలా ఈ దేశాన్ని మేం కాపాడాలనుకుంటున్నామని ఉద్యోగుల కోతలపై సంకేతాలు ఇచ్చారు.
6) Nayanthara: అది నన్ను షాక్‌కు గురిచేసింది.. ధనుష్‌పై నయన్ విమర్శలు..
Nayanthara Dhanush: నటి నయనతార జీవితం ఆధారంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ప్లిక్స్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించింది. నయనతార కెరీర్ మొదలు వివాహం వరకు అంశాలను ఇందులో చూపించనున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ పాటలు వినియోగించుకోవడానికి ఆ సినిమా నిర్మాత ధనుష్ అవకాశం ఇవ్వలేదు. ఇందుకుగాను ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఈ వ్యవహారంపై నయనతార ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.
మూడు పేజీల నిడివి ఉన్న సుదీర్ఘ నోటీసును ఇన్‌స్టావేదికగా పంచుకున్నారు. ఇందులో ఆమె పలు విషయాలను ప్రస్తావించారు. తండ్రి, దర్శకుడైన సోదరుడి సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ రాసుకొచ్చారు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి తాను ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుందని నయన్ తెలిపారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.