Chennai Doctor Stabbed: చెన్నైలో డాక్టర్‌పై క్యాన్సర్ పేషెంట్ కుమారుడు కత్తితో దాడి చేసి..
Chennai Doctor Stabbed: ప్రభుత్వ వైద్యుడిపై ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. డాక్టర్‌ను కత్తితో నరికిన తరువాత నిందితుడు ఆ కత్తిని పక్కనపడేసి తాపీగా నడుచుకుంటూ బయటికి వెళ్లబోయారు. కానీ అప్పటికే పేషెంట్స్, హాస్పిటల్ సిబ్బంది గట్టిగా కేకలు వేయడంతో సెక్యురిటీ వచ్చి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పెరుంగళత్తూర్‌కు చెందిన విఘ్నేశ్వరన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరు నెలలు పాటు బాలాజీ జగన్నాథన్ అనే డాక్టర్ ఆమెకు చికిత్స అందించారు. అయినా ఆమె ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. దీంతో అసహనానికి గురైన ఆయన డాక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. డాక్టర్ మెడ, చెవి, నుదురు, వీపు, కడుపుపై తీవ్రగాయాలయ్యాయి. బాలాజీని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు తమిళనాడు సీఎం స్టాలిన్. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందించడంలో వైద్యుల కృషి ఎనలేనిదని, వారి భద్రతకు భరోసా కల్పించడం మన కర్తవ్యమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ దాడిని నిరసిస్తూ తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. అత్యవసర సేవలు మినహా వైద్య విద్యార్థుల క్లాసులతో పాటు సర్జరీలు, ఓపీడీ సేవలను నిలిపివేసినట్టు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆగష్టులో కోల్‌కత్తాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో 31 ఏళ్ల వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ చెన్నైలో వైద్యుడిపై హత్యాయత్నం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.