చట్టసభల్లో నేరచరితులు : తాజా, మాజీలపై 4,442 కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే..
దేశంలో తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,442 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు సుప్రీంకోర్టు వివిధ హైకోర్టుల నుంచి..
దేశంలో తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,442 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు సుప్రీంకోర్టు వివిధ హైకోర్టుల నుంచి తెప్పించిన డేటాలో వెల్లడయ్యింది. సిట్టింగ్ శాసనసభ్యులు నిందితుల జాబితాలో 2,556 మంది ఉన్నారని నివేదించారు. సిట్టింగ్, మాజీ ఎంపీలు / ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను వేగంగా విచారించాలని కోరుతూ అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం, ప్రస్తుత, మాజీ శాసన/
పార్లమెంటు సభ్యులపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పంపాలని వివిధ హైకోర్టులను ఆదేశించింది. మొత్తం పెండింగ్ కేసుల జాబితాలో మొదటిస్థానంలో ఉత్తరప్రదేశ్, రెండోస్థానంలో బీహార్ ఉన్నాయి. ఈ కేసులో సుప్రీంకోర్టుకు సహాయం చేయడానికి అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది హన్సారియా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల హైకోర్టు రిజిస్ట్రార్ లు సమర్పించిన సమాచారం ఆధారంగా హన్సారియా ఈ అఫిడవిట్ సమర్పించారు. దీంతో సిట్టింగ్ మరియు మాజీ ఎంపీలు / ఎమ్మెల్యేలతో కూడిన క్రిమినల్ కేసులను ప్రత్యేకంగా విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీం రాష్ట్రాలను ఆదేశించింది.
సిట్టింగ్ ఎంపీలు / ఎమ్మెల్యేలపై 446 కేసులు పెండింగ్‌లో ఉన్నందున యుపి అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత కేరళ 310 కేసులలో విచారణ ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎంపీలు / ఎమ్మెల్యేలతో రెండవ స్థానంలో ఉంది. ఇక తెలుగురాష్ట్రాల్లో ఏపీలో అత్యధికంగా 85, తెలంగాణలో 107 కేసులు సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉన్నాయని సుప్రీంకోర్టుకు ఇచ్చిన డేటాలో హన్సారియా వివరించారు.