Sirisha Bandla: అంతరిక్షయానం చేసిన తెలుగు అమ్మాయి
Sirisha Bandla: రోదసిలోకి దూసుకెళ్లిన భారత మూడో మహిళగా బండ్ల శిరీష రికార్డు
Sirisha Bandla: అది అంతరిక్షయానం.. భూమికి 90 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణం. అక్కడ జర్నీ చేయాలంటే ధైర్యంకావాలి. సాధించాలన్న కసి ఉండాలి. అలాంటి టార్గెట్‌తో స్పేస్ జర్నీ చేసి చరిత్ర సృష్టించింది మన తెలుగు అమ్మాయి. అంతరిక్షయానం చేసి ఔరా అనిపించింది. గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష న్యూ మెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ 22 ద్వారా కర్మాన్ రేఖను దాటి నింగిలోకి దూసుకెళ్లింది. తెలుగమ్మాయి బండ్ల శిరీషతో సహా ఆరుగురు వ్యోమనౌకలో 90 నిమిషాల పాటూ ఆకాశంలో చక్కర్లు కొట్టివచ్చారు.
బండ్ల శిరీష ఏపీలోని గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ అనురాధ, డాక్టర్ మురళీధర్‌రావు చాలా ఏళ్ల కిందట అమెరికాకు వలస వెళ్లారు. పర్‌డ్యూ యూనివర్సిటీలో శిరీషా ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రో నాటికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ కూడా చదివారు.
బండ్ల శిరీషాకు చిన్నప్పటి నుంచి ఆకాశం అంటే ఆసక్తి. ఆకాశంలోని అంతుచిక్కని రహస్యాల గుట్టు విప్పాలని కలలు కనేది. ఏనాటికైనా రోదసిలో విహరించాలని సంకల్పంచింది. ఆ సంకల్పమే ఇప్పుడు నిజమైంది. ముందుగా నాసాలో వ్యోమగామి కావాలనుకున్నారు. కానీ కంటిచూపు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆ అవకాశాన్ని అందుకోలేక పోయారు. అయితేనేం నిరాశ చెందలేదు. పట్టువీడలేదు. కమర్షియల్ స్పేస్ ఫ్లైట్‌ల రంగంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.
ఆ కంపెనీది ఒక్కటే టార్గెట్.. అందరికీ అంతరిక్షయానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. అంతరిక్ష పర్యాటకులకు ఈ యాత్ర జీవితకాల అనుభూతిగా మిగిలిపోయేలా చూసేందుకు అవసరమైన మార్గాలను ఈ కంపెనీ అన్వేషిస్తోంది. అందులో భాగంగానే అంతరిక్షయానం చేసి క్షేమంగా తిరిగి వచ్చారు. ఇప్పటికే చాలా మంది వర్జిన్ గెలాక్టిక్‌కు 2.5 లక్షల డాలర్ల చొప్పున చెల్లించి తమ సీట్లను రిజర్వు చేసుకోవడం గమనార్హం.