Silver Brick For Ram Mandir Foundation by PM Modi: శంఖుస్థాపనకు మోడీ వెండి ఇటుక.. ప్రధాని చేతుల మీదుగా కార్యక్రమం
Silver Brick For Ram Mandir Foundation by PM Modi: అతిరధ మహారధుల సమక్షంలో అయోధ్యలో రామాలయానికి పునాది పడనుంది.
Silver Brick For Ram Mandir Foundation by PM Modi: అతిరధ మహారధుల సమక్షంలో అయోధ్యలో రామాలయానికి పునాది పడనుంది. ఈ వేడుకకు ప్రధాని మోడీ చేతుల మీదుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీతో పాటు పలువురిని ఆహ్వానించేందుకు కమిటీ ఏర్పాట్లు చేసింది. అయోధ్య రామాలయం భూమి పూజకు ప్రధాని మోడీ రానున్నారు. ఆయన చేతులు మీదుగా రాముడి గుడికి శంకుస్థాపన జరగనుంది. ఆగస్టు 5వ తేదీన భూమి పూజా కార్యక్రమం ఉంటుందని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భూమి పూజ సందర్భంగా ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించి.. తొలి శ్రీరామ ఇటుకను అక్కడ పేర్చనున్నారు.
రామాలయం భూమి పూజలో మొత్తం ఐదు వెండి ఇటుకలను ఏర్పాటు చేయనున్నారు. తొలి 40 కిలోల వెండి ఇటుకను మోడీ పేర్చనున్నారు. హిందూ పురాణాల ప్రకారం.. అయిదు గ్రహాలకు సూచకంగా అయిదు వెండి ఇటుకలను వాడనున్నారు. విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన డిజైన్ ప్రకారమే ఆలయాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు ఆలయం శైలిలో ఆలయాన్ని రూపొందించారు. అష్టభుజ ఆకారంలో గర్భాలయం ఉండనుంది. గతంలో ఇచ్చిన మోడల్ కన్నా.. ఇప్పుడు శ్రీరామాలయం ఎత్తు, వైశాల్యం, పొడుగును కొంత పెంచారు. ముందుగా అనుకున్న మూడు గోపురాల స్థానంలో.. అయిదు గోపురాలను ఏర్పాటు చేయనున్నారు. ఆలయ విస్తీర్ణం సుమారు 76 వేల చదరపు గజాల నుంచి 84వేల చదరపు గజాలు ఉంటుంది. గతంలో కేవలం 38వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుండటంతోపాటు ఇప్పుడు బాలరాముడు ఎక్కడైతే పూజలు అందుకుంటున్నాడో అక్కడి నుంచే ఆలయం మొదలు కానుంది.
అయోధ్య రాముడి గుడి నిర్మాణ భూమి పూజ ప్రణాళికలో వేగం పెంచింది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు. ఇప్పటికే తేదీని ఫెక్స్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా అతిథుల లిస్ట్ ను కూడా ఫైనల్ చేసింది. ఈ కార్యక్రమానికి 250 మంది అతిథులనే పిలవాలని ట్రస్టు నిర్ణయించింది. భూమిపూజ కార్యక్రమానికి అయోధ్యలోని ముఖ్యమైన సాధువులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ సీనియర్ ప్రతినిధులను పిలవాలని నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున కొద్ది మందిని మాత్రమే పిలవాలని నిర్ణయించింది. ఆగస్టు 5వతేదీన జరగనున్న రామాలయం భూమిపూజ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.