Shutdowns Tv Serial Shooting: ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్ రద్దు
Shutdowns Tv Serial Shooting: కరోనా నియంత్రణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
Shutdowns Tv Serial Shooting: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో మినీ లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కరోనా చెలరేగిపోవడంతో కరోనా నియంత్రణలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మినీ లాక్‌డౌన్‌లో భాగంగా హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్‌లు, సెలూన్లు మూసి వేసిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో వివిధ టీవీ సీరియళ్ల షూటింగ్ నిలిచిపోనుంది.
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నప్పటికీ ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. మహమ్మారి కట్టడిలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం సెక్షన్ 144, రాత్రి సమయంలో కర్ఫ్యూతోపాటు వీకెండ్‌లో అంటే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది. మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 45,391 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 26,95,148కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,34,603 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
రోజురోజుకూ పెరుగుతున్న కేసులను తగ్గించ లేమని, పూర్తి స్థాయి లాక్ డౌన్ ను పెట్టాల్సిందేనని మహారాష్ట్ర మంత్రులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను కాపాడాలంటే, కొన్ని రోజులు పూర్తిగా నిబంధనలను అమలు చేయాల్సిందేనని ఆరోగ్య మంత్రి రాజేష్ తోపేతో పాటు మరో మంత్రి విజయ్ వడ్డేటివర్ సీఎం ఉద్ధవ్ థాకరేను కోరినట్లు సమాచారం.