Union Budget 2024: 57 నిమిషాల మధ్యంతర బడ్జెట్‌.. అతి తక్కువ సమయం ప్రసంగించిన నిర్మలా సీతారామన్‌

Union Budget 2024: ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డు

Update: 2024-02-01 09:34 GMT

Union Budget 2024: 57 నిమిషాల మధ్యంతర బడ్జెట్‌.. ఈ ఏడాది అతి తక్కువ సమయం ప్రసంగించిన నిర్మలా సీతారామన్‌

Union Budget 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోసారి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, గతంతో పోలిస్తే ఈసారి నిర్మలా సీతారామన్‌ ప్రసంగం అత్యంత తక్కువ సమయంలో ముగిసింది. తన ప్రసంగాన్ని గంటలోపే ముగించారు.

 నిర్మలా సీతారామన్‌ ఇప్పటివరకు చేసిన బడ్జెట్‌ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం మాట్లాడారు. 47 లక్షల 66 వేల కోట్ల రూపాయల అంచనాతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల పద్దులను 57 నిమిషాల్లోనే వినిపించారు. ఇందులో పదేళ్ల పాలనలో సాధించిన విజయాలు.. కొత్తగా తీసుకువచ్చేందుకు రూపొందించబోతున్న పథకాలను వివరించారు.

ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా.. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020-21 బడ్జెట్‌ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ప్రసంగించారామె. ఆరోగ్యం సహకరించకపోవడంతో మరో రెండు పేజీలు మిగిలిఉండగానే ప్రసంగాన్ని ముగించారు. బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం రెండో అతి పెద్దది. అంతకుముందు 2003-04 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జశ్వంత్‌సింగ్‌ 135 నిమిషాల పాటు మాట్లాడారు. గతేడాది నిర్మలమ్మ 86 నిమిషాల పాటు బడ్జెట్‌ ప్రసంగం వినిపించగా ఈ ఏడాది 57 నిమిషాల పాటు మాత్రమే ప్రసంగించారు. 

Tags:    

Similar News