Enforcement Directorate: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు
* చార్టెర్డ్ ఫ్లైట్స్ రాకపోకలు, ప్రయాణికుల వివరాలపైనా ఆరా.. రాజకీయ నేతల ప్రమేయంపైనా ఫోకస్
Enforcement Directorate: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రోజుకో మలుపు చోటు చేసుకుంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు లింక్‌లు ఉన్నట్లు తేలుతోంది. బేగంపేట ఎయిర్‌పోర్టు కేంద్రంగా ప్రైవేట్ చార్టెర్డ్ విమానాల ద్వారా పెద్ద ఎత్తున ఢిల్లీకి నగదు తరలించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇతర ప్రాంతాలకూ నగదు వెళ్లిందని భావిస్తున్నారు. చార్డర్డ్ ఫ్లైట్స్‌లో డబ్బు తరలించడం వెనక తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతల ప్రమేయంపైనా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి.
చార్టర్డ్ ఫ్లైట్స్‌కు స్ర్కీనింగ్ లేకపోవడం, వీఐపీలు వెళ్లడంతో డబ్బు తరలించడం ఈజీ అవుతుందని ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. లిక్కర్ స్కాం సూత్రధారులు, పాత్ర ధారుల వివరాలపై ఆరా తీస్తున్నాయి. ప్రైవేటు చార్టర్డ్ ఫైట్స్‌కు బేగంపేట్ నుంచి అనుమతుల నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రోటోకాల్ ఉన్న అత్యంత ముఖ్యుల చార్టర్డ్ ఫ్లైట్స్‌కే పర్మిషన్ ఉన్నట్లు సమాచారం. మిగతా చార్టెడ్ ఫ్లైట్స్ అన్నీ శంషాబాద్ నుంచే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఓ సంస్థ ఆపరేషన్స్‌పై పౌర విమానాయన సంస్థకు ఈడీ లేఖ రాసినట్లు తెలుస్తోంది. చార్టర్డ్ ఫ్లైట్స్ రాకపోకలు, ప్రయాణికుల వివరాలపైనా ఆరా తీస్తోంది. ఈ మేరకు పలు సంస్థలకు పౌర విమానయాన సంస్థ లేఖలు రాసినట్లు సమాచారం. తామే అడిగిన సమాచారానికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు పంపాలని సూచించింది. త్వరలోనే ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ కేసులో అప్రూవర్ గా మారేందుకు వ్యాపారవేత్త దినేశ్ అరోరా చేసిన విజ్ఞప్తిని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దినేశ్ అరోరా మంత్రి మనీశ్ సిసోడియాకు సహాయకుడిగా వ్యవహరించారు. అరోరా స్వతహాగా సరెండర్ అవుతానని కోర్టుకు విన్నవించుకోవడంతో కోర్టు అనుమతించింది. ఈ కేసులో దినేశ్ అరోరా స్టేట్ మెంట్ కీలకం కానుంది. దినేశ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.