సీఎంతో ఎంపీ నవనీత్‌ కౌర్‌ ఫైట్.. ముంబైలో టెన్షన్.. టెన్షన్..

Navneet Rana: మహారాష్ట్ర రాజధాని ముంబైలో హైడ్రామా కొనసాగుతోంది.

Update: 2022-04-23 10:00 GMT

సీఎంతో ఎంపీ నవనీత్‌ కౌర్‌ ఫైట్.. ముంబైలో టెన్షన్.. టెన్షన్..

Navneet Rana: మహారాష్ట్ర రాజధాని ముంబైలో హైడ్రామా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే ఇంటి ఎదుట హనుమాన్‌ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్‌ కౌర్‌, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు ప్రకటించడంతో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌ నివాసం ఎదుట భారీగా ఆందోళనలకు దిగారు. నవనీత్‌ కౌర్‌, రవి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నవనీత్‌ కౌర్‌ నివాసంలోకి దూసుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన బారీ కేడ్లను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే శివసేన కార్యకర్తల తీరుపై ఎంపీ నవనీత్‌ కౌర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నివాసంపై దాడి చేయాలని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేనే స్వయంగా పార్టీ కార్యకర్తలు పంపారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి ప్రజలను ఎలా జైల్లో పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదన్నారు. మాతోశ్రీని తాము దేవాలయంలో భావిస్తున్నామని.. ఉద్దవ్‌ థాక్రే ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని నవనీత్‌ కౌర్‌ విమర్శించారు. తాను మరోసారి చెబుతున్నానని, సీఎం ఉద్దవ్‌ నివాసం మాతోశ్రీ వద్దకు వెళ్లి హనుమాన్ చాలీసాను పఠించి తీరుతానని నవనీత్ కౌర్ స్పష్టం చేశారు.

సీఎం ఉద్దవ్‌ థాక్రే నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్‌ చాలిసీ పఠిస్తామని హెచ్చరించిన నవనీత్‌ రాణా దంపతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి వారే బాధ్యత వహించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నవనీత్‌కు 'వై' కేటగిరీ భద్రతను కల్పిస్తోంది. మరోవైపు నవనీత్‌ కౌర్‌ రాణా దంపతుల వ్యాఖ్యలతో నగర వ్యాప్తంగా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. 

Tags:    

Similar News