Shashi Tharoor about PV: విదేశీ సత్సంబంధాల్లో ఆయనే మేటి..పీవీని కొనియాడిన శశిథరూర్
Shashi Tharoor about PV: పీవీ జయంతో్త్సవాల్లో భాగంగా ఆయన చేసిన సేవలను విదేశీ వ్యవహారాల శాఖ మాజీమంత్రి శశిథరూర్ కొనియాడారు.
PV Narasimharao | పీవీ జయంతో్త్సవాల్లో భాగంగా ఆయన చేసిన సేవలను విదేశీ వ్యవహారాల శాఖ మాజీమంత్రి శశిథరూర్ కొనియాడారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ వ్యవహారాలను ఆయన చక్కదిద్దిన తీరును వివరించారు. ఇదే సమయంలో ఘన నీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పుకొచ్చారు. టీపీసీసీ వెబ్ సెమినార్ లో పాల్గొన్న మాజీ ఎంపీ శశిథరూర్ పీవీ చేసిన ఘనమైన పనులను వివరించారు.
ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సఫలీకృతమయ్యారని, విదేశాంగ వ్యవహారాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని లోక్‌సభ సభ్యుడు, విదేశీ వ్యవహారాల శాఖ మాజీమంత్రి శశిథరూర్ అన్నారు. పీవీ హయాంలో అమెరికాతో ఆర్థికంగా బలమైన ఒప్పందాలు జరిగాయని, విదేశాంగ విధానంలో ఆయన అనేక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఆదివారం టీపీసీసీ ఆధ్వర్యంలో పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్‌పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన ఇందిరాభవన్‌లో జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు.
దక్షిణాసియా దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంతోపాటు లుక్ ఈస్ట్, లుక్ వెస్ట్ పాలసీ రూపొందించిన ఘనత పీవీకి దక్కుతుందన్నారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలకు భారత్‌ను ఒక రోల్‌మోడల్‌గా నిలిపారని కొనియాడారు. సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టి కేవలం రెండేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 36 శాతం పెంచారని తెలిపారు. పీవీ నేతృత్వంలో భారత్.. ప్రపంచ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిందని, ప్రధానిగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం దేశం అభ్యున్నతికి కారణమైందని అన్నారు. దేశం అణ్వాయుధ సాంకేతికతను సాధించడంలో కీలకపాత్ర పోషించారని, 1993 లో చైనాలో పర్యటించడం ద్వారా స్నేహహస్తం అందించి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించారని గుర్తు చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్ని తన చాణక్యంతో నడిపిన పీవీ ప్రపంచ స్థాయి మేధావి అని, పది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే మేధస్సు ఉన్నగొప్ప వ్యక్తి అని శశిథరూర్ కొనియాడారు.
పీవీ ప్రధానిగా నేను సైన్యంలో..: ఉత్తమ్
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీవీ నర్సింహారావు నాయకత్వంలో భారతదేశం గొప్పగా వెలుగొందిందని వ్యాఖ్యానించారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు తాను సైన్యంలో ఉన్నానని, వాయుసేనను బలోపేతం చేయడం కోసం మిగ్– 21 ఫ్లైట్‌లు సైన్యంలో ప్రవేశ పెట్టారని, రష్యాతో స్నేహపూర్వక బంధాలను ఏర్పాటు చేసి సైన్యాన్ని బలోపేతం చేశారన్నారు. ఇంకా వెబ్ నార్ లో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, మాజీ ఎంపీ, కమిటీ గౌరవాధ్యక్షుడు వి.హనుమంతరావు, వైస్ చైర్మన్, ఎమ్యెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు.