ఘోర రోడ్డు ప్రమాదం: వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రాలర్.. ఏడుగురు మృతి
డ్రైవర్ల నిర్లక్షానికి రోజూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా..
డ్రైవర్ల నిర్లక్షానికి రోజూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిల్వారా జిల్లాలో ఓ ట్రాలర్, వ్యాన్‌ను ఢీకోట్టడంతో దీంతో ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి బిజోలియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కేశార్‌పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది, ప్రమాద సమయంలో బాధితులు కోటా నుండి భిల్వారాకు వ్యాన్ లో వెళుతున్నారు. కేశార్‌పూర్ వద్దకు రాగానే వ్యాన్‌ను ట్రాలర్ బలంగా ఢీకోట్టడంతో వ్యాన్ నుజ్జునుజ్జయ్యింది. వ్యాన్ లో ప్రయాణిస్తున్న అందరూ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. మృతులను ఉమేష్ (40), ముఖేష్ (23), జామ్నా (45), అమర్ చంద్ (32), రాజు (21), రాధేశం (56), శివాలాల్ (40) గా గుర్తించారు.
మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.. మృతుల్లో ఆరుగురు సింగోలీ గ్రామానికి చెందినవారు కాగా, ఒకరు సాలావటియాకు చెందినవారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వ్యానులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై గంటపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాలర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అతివేగంగా వచ్చి వ్యాన్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం స్థానికులను విచారిస్తున్నారు. కాగా ట్రాలర్ డ్రైవర్, వ్యాన్ డ్రైవర్ లలో ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.