Kalmandvi Waterfalls: సెల్ఫీ... ఐదుగురి ప్రాణాలు తీసింది
Kalmandvi Waterfalls: ఆధునికత మోజులో రోజూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
Kalmandvi Waterfalls: ఆధునికత మోజులో రోజూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. కొండల మీద, గుట్టల మీద, కదిలే రైళ్ల మీద, కదిలే బస్సుల మీద చివరకు నదులు, కాలువలు అనే తేడా లేకుండా చేస్తున్న ఈ విపరీత దోరణి వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నా కళ్లు తెరవడం లేదు.
సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా ఓ జలపాతం వద్ద సరదాగా సెల్ఫీ దిగుదామని ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లా జవహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం కొవిడ్-19 లాక్‌డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ 13 మందితో కూడిన ఓ బృందం జవహార్ టౌన్ సమీపంలోని కాల్మండ్వి జలపాతం వద్దకు వెళ్లినట్టు అధికారులు పేర్కొన్నారు. అక్కడ చాలా సేపు వీరు సందడిగా తిరిగారు. జలపాతం పరిసరాల్లో సెల్ఫీలు తీసుకుంటూ సంబరాల్లో మునిగారు. ఈసమయంలో ఘోరం జరిగిపోయింది. సెల్ఫీ హడావుడి వారి కొంప ముంచింది.
వివరాల్లోకెళితే.. "ఈ బృందంలోని ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ తీసుకుంటూ కిందనున్న కొలనులో జారిపడ్డారు. వారిని రక్షించేందుకు మరికొందరు నీళ్లలోకి దూకారు. ఈ క్రమంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు..'' అని స్థానిక పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.