Coronavirus: రూపం మార్చుకుని విజృంభిస్తున్న కరోనా.. ఏప్రిల్ చివరివారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రరూపం

Coronavirus: కరోనా రూపం మార్చుకుంది. సెకండ్ వేవ్ రూపంలో దూసుకొస్తుంది. గతేడాది ఇదే సమయానికి తన ప్రతాపం చూపించిన మహమ్మారి మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో విజృంభిస్తుంది.

Update: 2021-03-25 13:41 GMT

Coronavirus: రూపం మార్చుకుని విజృంభిస్తున్న కరోనా.. ఏప్రిల్ చివరివారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రరూపం 

Coronavirus: కరోనా రూపం మార్చుకుంది. సెకండ్ వేవ్ రూపంలో దూసుకొస్తుంది. గతేడాది ఇదే సమయానికి తన ప్రతాపం చూపించిన మహమ్మారి మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో విజృంభిస్తుంది. వారం పది రోజులు నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి సెకండ్ వేవ్ కారణమంటున్నారు. ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా మరోవైపు పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా నమోదు అయిన కేసుల్లో డబుల్ మ్యూటెంట్ వైరస్ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో ఎస్‌బీఐ నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. కరోనా రూపం మార్చుకుని విజృంభిస్తుంది. దాంతో వేల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశంలో విపరీతంగా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో ఫిబ్రవరి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగడం కొవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తికి నిదర్శనమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నివేదిక వెల్లడించింది.

కరోనా సెకండ్ వేవ్ ఫిబ్రవరి 15 నుంచి 100 రోజుల పాటు ఉండనుందని నివేదికలో పేర్కొంది. దీంతో రానున్న ఏప్రిల్ చివరివారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రరూపం దాల్చనుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశ వ్యాప్తంగా దాదాపు 25లక్షల మంది సెకండ్ వేవ్ వైరస్ బారిన పడే అవకాశం ఉందని ఎస్‌బీఐ అంచనా వేసింది. అయితే కొవిడ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు విధించే లాక్‌డౌన్, ఆంక్షలు అంతగా ప్రభావం చూపకపోవచ్చని పేర్కొంది. ఇప్పటికే పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల వల్ల దేశంలో కొన్ని వ్యాపార రంగాలు ఆర్థికంగా క్షీణించాయని ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్, ఆంక్షలు విధించాయి. అయితే రెండో దశలో కరోనాకు మరిన్ని వ్యాపార రంగాలు దెబ్బతినే అవకాశం ఉందని ఎస్‌బీఐ తన నివేదకలో ప్రకటించింది.

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒక్కటే సరైన మార్గంలా కనిపిస్తోందని ఎస్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 34 లక్షల డోసులను పంపిణీ చేస్తున్నారు. వీటిని రోజుకి 40 నుంచి 45 లక్షలకు పెంచినప్పటికీ 45 ఏళ్లకు పైన వారందరికీ టీకా అందించడానికి మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక అంచానా వేసింది.

భారత్‌లో ఇవాళ 53వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర మరోసారి కరోనాకు కేంద్రంగా మారింది. ఒక్కరోజే 32 వేల 855 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క ముంబై నగరంలోనే 5వేలకు పైగా కేసులున్నాయి. అటు ఐటీ రాజధాని బెంగళూరులో సెకెండ్ వేవ్ విజృంభిస్తుంది. మరోవైపు పంజాబ్‌లో కరోనా పంజా విసురుతోంది.

ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒకే రోజు వ్యవధిలోనే 5వందలకు చేరువలో ఉన్నాయి. తాజాగా కరోనాతో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 138 కొవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అటు ఏపీలోనూ కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఇవాళ ఏకంగా 758కి చేరాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 175 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 127 విశాఖలో 98 కృష్ణాలో 80 అనంతపురంలో 56 తూర్పుగోదావరిలో 45 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తానికి భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు సరైనా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మాస్క్‌లు, భౌతిక దూరం, శానిటైజర్ ఎప్పటికప్పుడు ఉండాలని సూచిస్తున్నాయి. 

Tags:    

Similar News