Covid19 Updates: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..ఒక్కరోజే భారీగా నమోదు
Covid19: Corona Virus:
Covid19: భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 18వేల 327 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం 14వేల 234 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి 11లక్షల 92వేలకు చేరింది. గడిచిన 24 గంటల్లో 108 మంది కరోనాతో(Corona Virus) మృతి చెందారు. ముఖ్యంగా...ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, పంజాబ్‌లతో పాటు పలు రాష్ట్రాలలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. అందుకే పది వేల లోపునకు తగ్గిపోయిన రోజు వారీ కేసులు క్రమంగా పెరుగుతూ 18 వేలు దాటిపోయాయి. కేసులు తీవ్రంగా ఉన్న పంజాబ్, మహారాష్ట్రలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపించింది.
అమెరికా తీసుకున్న నిర్ణయంతో కరోనా వ్యాక్సిన్ తయారీకి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని భారత సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీకి ఉన్న ఆటంకాలు తొలగించాల్సి ఉందని చెప్పాయి. వ్యాక్సిన్ తయారీలో ఎంతో కీలకమైన ముడి పదార్థాల ఎగుమతులపై అమెరికా నిషేధం విధించడాన్ని తప్పుపడుతున్నాయి. వ్యాక్సిన్‌కు అవసరమైన బ్యాగులు, ఫిల్టర్లతో పాటు పలు కీలక వస్తులపై అమెరికా తాత్కాలిక నిషేధం విధించింది. అమెరికా సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రపంచ దేశాలకు తక్కువ ధరకు వ్యాక్సిన్ అందిస్తున్న భారతీయ కంపెనీలకు.. అమెరికా నిర్నయం తీవ్ర అవరోధాలు కలిగిస్తోందని సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది.
చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ఏడాదిలో ఎన్నో మార్పులకు గురైంది. ఇప్పుడు బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌తో సహా అనేక దేశాల్లో న్యూ స్ట్రెయిన్స్ పుట్టుకొచ్చాయి. అయితే వుహాన్ వైరస్‌ను లక్ష్యంగా చేసుకునే అనేక దేశాలు వ్యాక్సిన్‌ను తయారు చేశాయి. తాజాగా పుట్టుకొస్తున్న కొత్త రకాలను ఆ టీకాలు ఎదుర్కొనగలవా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి వాషింగ్టన్ యూనివర్శిటీ పరిశోధన సాగించింది. కోవిడ్ 19 యాంటీ బాడీల ఆధారంగా తయారైన టీకాలు కొత్త రకాల వైరస్‌ను నియంత్రించలేకపోవచ్చని తేలింది. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కొత్త వైరస్‌లో ప్రవేశిస్తే...ప్రస్తుత టీకాలు సమర్థవంతంగా పనిచేయకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.