ఇంకో ఐదు రోజులు అంతే...

Update: 2021-01-07 16:00 GMT

ఇంకో ఐదు రోజులు అంతే ! కష్టం తీరడానికి ! కాంపౌండ్ వాల్ దాటి రాకుండా చూసుకోవడానికి ! 13నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతుండగా రేపు మరోసారి డ్రైరన్ నిర్వహించనున్నారు. అతి చిన్న లోటుపాట్లను కూడా గుర్తించనున్నారు. పుణే కేంద్రంగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.

13 నుంచి వ్యాక్సిన్ సరఫరాకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయ్. ఇప్పటికే రెండురోజుల పాటు దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్ నిర్వహించిన కేంద్రం సర్వం సిద్ధం చేసింది. వ్యాక్సిన్ ఇవ్వడం మినహా అన్ని విషయాలను పరిశీలించింది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రక్రియ కొనసాగించాలని భావిస్తున్న కేంద్రం శుక్రవారం మరోసారి డ్రైరన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రతీ జిల్లాలో ఐదు వేర్వేరు ఆసుపత్రుల్లో చేపట్టనున్నారు. మెడికల్ కాలేజీ ఆసుపత్రి, అర్బన్ పీహెచ్‌సీ, రూరల్ పీహెచ్‌సీ, తాలూకా ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తో పాటు ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో డ్రైరన్ నిర్వహించనున్నారు.

ఇక అటు డీసీజీఐ అనుమతిచ్చిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాల రవాణాకు రూట్ క్లియర్ అయింది. శుక్రవారం నుంచి టీకాల రవాణాను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ప్రయాణికుల విమానాల్లో ట్రాన్స్‌పోర్ట్ చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుండగా కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా టీకాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. శుక్రవారం నాటి డ్రై రన్‌, టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడంపై సూచనలు చేశారు. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కేసులు అనూహ్యంగా పెరగడంపై హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని రాష్ట్రాలూ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి హర్షవర్ధన్ సూచించారు. దేశంలోని ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రాధామ్య వర్గాలకు ముందుగా టీకా ఇవ్వాలని డీసీజీఐ కమిటీ సూచించిందని చెప్పారు. పుణె కేంద్రంగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని, దీనికోసం దేశవ్యాప్తంగా 41స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.

మరోవైపు కొవాగ్జిన్‌‌ను అభివృద్ధి చేస్తున్న భారత్‌ బయోటెక్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌కు వాలంటీర్ల ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినట్లు వెల్లడించింది. మూడోదశలో 26వేల మందికి టీకా ఇవ్వాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు వాలంటీర్లుగా 25వేల 800 మంది ఎన్‌రోల్‌ చేసుకున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో తమకు మద్దతుగా నిలుస్తున్న అందరికీ భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News