Maharashtra:మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న అవినీతి

Maharashtra: అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

Update: 2021-03-24 02:54 GMT

మహారాష్ట్ర;(ఫోటో ది హన్స్ ఇండియా)

Maharashtra: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఆరోపణలు వచ్చిన సమయం అయిన ఫిబ్రవరిలో దేశ్‌ముఖ్‌ ఎక్కడున్నారన్నదానిపై ఎన్సీపీ, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం నెలకొంది. దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు పార్లమెంట్ లోనూ ప్రకంపనలు సృష్టించాయి. ఇటు లోక్ సభ, అటు రాజ్యసభలో వాడీ వేడీ చర్చ జరిగింది.ఈ నేపథ్యంలో హోంమంత్రి ట్విటర్‌ వేదికగా స్పందించారు. బీజేపీ ఆరోపణలను ఖండించారు.

కొట్టిపారేసిన ఎన్సీపీ అధినేత...

ఫిబ్రవరి మధ్యలో సచిన్‌ వాజేను దేశ్‌ముఖ్‌ ముంబయిలోని తన అధికారిక నివాసానికి పిలిపించుకున్నారని మాజీ కమిషనర్‌ పరమ్‌వీర్‌ తన లేఖలో పేర్కొనగా.. దీన్ని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కొట్టిపారేశారు. ఆ సమయంలో దేశ్‌ముఖ్‌కు కరోనా సోకడంతో నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు. అయితే ఎన్సీపీ వాదనను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. ఫిబ్రవరి 15న నాగ్‌పూర్‌ నుంచి ముంబయికి ఓ ప్రైవేటు విమానంలో దేశ్‌ముఖ్‌ వచ్చినట్లు ఆయన పేరుతో ఓ విమాన టికెట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.

ట్విటర్‌ వేదికగా బదులిచ్చిన దేశ్ ముఖ్...

ఈ పరిణామాలపై దేశ్‌ముఖ్‌ ట్విటర్‌ వేదికగా బదులిచ్చారు. గతేడాది మహమ్మారి సమయంలో తాను రాష్ట్రమంతటా తిరుగుతూ పోలీసులను కలిసిన విషయం తెలిసిందేనన్న ఆయన.. విపత్కర సమయంలో వారిలో ధైర్యాన్ని పెంచేందుకే సమావేశమయ్యానని వివరించారు. ఫిబ్రవరి 5న తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని... దీంతో అప్పటి నుంచి 15 వరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని తెలిపారు. డిశ్చార్జ్‌ తర్వాత 10 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. అందువల్ల ఓ ప్రైవేటు విమానంలో ముంబయికి వచ్చానని చెప్పుకొచ్చారు.

మరో బాంబు పేల్చిన ఫడ్నీవీస్...

ఇక ఇదే సమయంలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మరో బాంబు పేల్చారు. అనిల్ ను కాపాడుకునే క్రమంలో రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకుందని అన్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి సంకీర్ణ ప్రభుత్వం బండారాన్ని బయటపెడతానని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన... ఐపీఎస్, నాన్ ఐపీఎస్ అధికారుల పోస్టింగ్ రాకెట్ కు సంబంధించిన కీలక పత్రాలు, కాల్ రికార్డింగులు తన వద్ద ఉన్నాయని చెప్పారు.

 పార్లమెంటుకు చేరిన వివాదం...

ప్రకంపనలు సృష్టించిన ముంబయి మాజీ పోలీస్ కమిషనర్​పరమ్​బీర్ సింగ్ లేఖ వివాదం.. పార్లమెంటుకు చేరింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం గద్దె దిగాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర ఎంపీ నవనీత్ రవి రాణా మధ్య మాటల యుద్ధం జరిగింది. రాజ్యసభలోనూ ఈ విషయంపై గందరగోళం నెలకొంది. 

Tags:    

Similar News