Mumbai Drugs Case: నవాబ్‌ మాలిక్‌.. మీపై చట్టపరమైన చర్యలు తప్పవు..!

* మంత్రి ఆరోపణలను తిప్పికొట్టిన సమీర్‌ వాంఖడే

Update: 2021-11-09 02:38 GMT

మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణలను తిప్పికొట్టిన సమీర్‌ వాంఖడే(ఫైల్ ఫోటో)

Mumbai Drugs Case: ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ అధికారి సమీర్‌ వాంఖడే మరదలికి డ్రగ్స్‌ వ్యాపారాలతో సంబంధముందంటూ మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సమీర్‌ వాంఖడే మంత్రి ఆరోపణలను తిప్పికొట్టారు. ఓ మహిళ పేరును బహిరంగంగా ప్రస్తావిస్తూ ఆరోపణలు చేసినందుకు గానూ చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

'మిత్రమా ఓ మహిళ పేరును ప్రచారం చేసి మంచి పని చేశారు. మీడియా ప్రకటన విడుదల చేసినప్పుడు కూడా మేం మహిళ గౌరవాన్ని కాపాడడంలో భాగంగా వారి పేర్లను ప్రస్తావించం. అటువంటిది ఇద్దరు పిల్లలు, కుటుంబమున్న ఓ మహిళ పేరును బహిరంగంగా ప్రకటించడం సరైందేనా..? నవాబ్‌ మాలిక్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నాం' అని ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే పేర్కొన్నారు.

వాంఖడే మరదలికి డ్రగ్స్‌ వ్యాపారాలతో సంబంధముందన్న వాటిపై సమాధానం చెప్పాలంటూ నవాబ్‌ మాలిక్‌ చేసిన డిమాండ్‌కు ఎన్‌సీబీ అధికారి ఈ విధంగా స్పందించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ చట్టం కింద 2008లో నమోదైన కేసులో వాంఖడే సతీమణి సోదరి పేరు కూడా ఉంది. ఈ కేసును ఆధారంగా చేసుకుని నవాబ్ మాలిక్‌ సమీర్‌పై ఆరోపణలు చేశారు.

''సమీర్‌ దావూద్‌ వాంఖడే మీ మరదలు డ్రగ్స్‌ వ్యాపారం చేశారా? దీనికి మీరు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆమె కేసు పుణె కోర్టులో పెండింగ్‌లో ఉంది'' అని మాలిక్‌ ట్వీట్ చేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన సమీర్‌ వాంఖడే 2008లో తాను ఇంకా సర్వీసులోకే రాలేదన్నారు. అంతేగాక, క్రాంతి రేడ్కర్‌ను తాను 2017లో వివాహం చేసుకున్నానని అందువల్ల మంత్రి ఆరోపిస్తున్న కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News