Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో సూఖా అరెస్ట్.. ఎవరీ సూఖా?
Salman Khan house firing case: సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో నవీ ముంబై పోలీసులు తాజాగా మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్‌లో నిందితుడు సూఖా ఉన్నట్లుగా సమాచారం అందుకున్న నవీ ముంబై పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. సూఖాను ముంబైకి తీసుకొస్తున్నారు. ఇవాళ గురువారం అతడిని ముంబై మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఇంతకీ ఎవరీ సూఖా?
సల్మాన్ ఖాన్ హత్యకు గతంలోనే సూఖా కుట్రపన్నినట్లుగా అతడిపై ఆరోపణలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాగా.. అందులో ఈ సూఖా ఒకరు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో అత్యంత చురుకుగా వ్యవహరించే షూటర్లలో ఒకరిగా సూఖాకు పేరుంది. పంజాబ్, రాజస్థాన్, హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్‌కి బలమైన నెట్‌వర్క్ ఉంది. అలా హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ కోసం పనిచేసే గ్యాంగ్‌స్టర్ల గ్యాంగ్‌లో ఈ సూఖా కూడా ఉన్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆదేశాల మేరకే సూఖా ముంబైలో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులకు పాల్పడినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు.
సూఖా స్వస్థలం హర్యానాలోని పానిపట్‌కి సమీపంలోని రైల్ కలాన్ అనే గ్రామం. అక్కడ సూఖా చుట్టూ అతడి అనుచరులతో పెద్ద నెట్‌వర్క్ నడిపిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఆ ప్రాంతంలో సూఖా కోసం పనిచేసే వారు కూడా చాలామందే ఉన్నారు. అందుకే సూఖాను అరెస్ట్ చేసే క్రమంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ ఆ గ్రామంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. హర్యానా పోలీసుల సాయంతో రైల్ కలాన్ వెళ్లి అక్కడ సూఖాను అదుపులోకి తీసుకున్నారు.
బాబా సిద్ధిఖి మర్డర్ తరువాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన గ్యాంగ్‌స్టర్స్, షూటర్స్ కార్యకలాపాలపై అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో వివిధ దాడుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన పలువురు షూటర్లు ఇప్పుడు ఎక్కడున్నారు అని వెతికి మరీ పట్టుకుంటున్నారు.
అందులో భాగంగానే గత నెలలో సౌత్ ఢిల్లీలో జిమ్ ఓనర్ నదీర్ షా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యోగేష్ కుమార్‌ని ఢిల్లీ-యూపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి మరీ అరెస్ట్ చేశారు. యోగేష్‌ని అరెస్ట్ చేసే క్రమంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. యోగేష్ తమపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అతడి కాలుపై కాల్పులు జరిపి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.