Ukraine: ఉక్రెయిన్ ను కమ్మేస్తున్న రష్యా సేనలు

ఉక్రెయిన్ కు ఆశ్రయమిచ్చిన దేశాలు యుద్ధంలో ఉన్నట్లే -పుతిన్

Update: 2022-03-07 02:26 GMT

Ukraine: ఉక్రెయిన్ ను కమ్మేస్తున్న రష్యా సేనలు

Russia-Ukraine: రష్యా పట్టు విడవడం లేదు.. ఉక్రెయిన్ తగ్గడం లేదు. కసితో రెండు దేశాలూ రగిలిపోతున్నాయి. దీంతో ఉక్రెయిన్ నగరాలపై క్షిపణుల దాడి, బాంబుల మోత ఏమాత్రం సద్దుమణగడం లేదు. ఉక్రెయిన్ ను అన్నివిధాలా దిగ్బంధం చేసేందుకు రష్యా సేన ముందుకు కదులుతోంది. ప్రత్యేక చర్చ పేరుతో జరుపుతున్న దాడిని సమర్థించుకొంటోంది. రష్యా బలగాలు తనను మట్టుబెడతాయేమోననే రీతిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భయంతో వణికిపోతున్నారు.

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు దాదాపు ముగింపు దశకు చేరుకుంటోంది. మరోవైపు యుద్ధంలో కకావికలమైన లక్షల మంది ఉక్రేనియున్లు వలసదారి పడుతున్నారు. అటు రష్యా సేనలు మేరియుపొల్, చెర్నిహైవ్‌లోని నివాస ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ శక్తివంతమైన బాంబుల్ని గుమ్మరిస్తున్నాయి. ఖర్కివ్ లో అణురియాక్టర్, అణు ఇంధనం ఉన్న ఒక సంస్థపైకి రాకెట్లతో దాడి చేసిందని ఉక్రెయిన వర్గాలు తెలిపాయి.

ఇవాళ రెండు దేశాల మధ్య మూడో విడత చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సముద్ర మార్గంతో ఉక్రెయిన్ కు సంబంధాలు లేకుండా చేయాలని రష్యా సేనలు చూస్తున్నాయి. మేరియుపొల్ ను స్వాధీనం చేసుకోవడం ద్వారా నేరుగా క్రిమియాతో భూ మార్గం ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఉక్రెయిన్ యుద్ధ విమానాలకు ఆదేశ చుట్టుపక్కల దేశాలు ఆశ్రయం కల్పించినా, వాటిని తమతో సైనిక ఘర్షణకు పాల్పడుతున్న దేశాలుగా పరిగణిస్తామని రష్యా హెచ్చరించింది.

Tags:    

Similar News