భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన.. 28 కీలక ఒప్పందాలు..

Narendra Modi - Vladimir Putin: భారత్‌ గొప్ప శక్తిమంతమైన దేశమని కొనియాడిన పుతిన్..

Update: 2021-12-07 02:12 GMT

భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన.. 28 కీలక ఒప్పందాలు..

Narendra Modi - Vladimir Putin: భారత్‌-రష్యా 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విచ్చేశారు. ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోడీతో పుతిన్ భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీతో పాటు పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. ఉభయ దేశాలకు సంబంధించి మొత్తం 28 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

భారత్‌కు రష్యా నమ్మదగిన భాగస్వామి అని, ఇరు దేశాల మధ్య సంబంధాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయని అన్నారు ప్రధాని మోడీ. ఉభయ దేశాల మధ్య సహకారం ఇకపై కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరువురం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తున్నామని తెలిపారు. కొవిడ్‌ సంక్షోభం తర్వాత పుతిన్‌ జరిపిన రెండో విదేశీ పర్యటన ఇదేనని, ఇరు దేశాల సంబంధాలకు పుతిన్‌ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పేందుకు ఈ పర్యటన ఒక ఉదాహరణ అన్నారు.

భారత్‌ గొప్ప శక్తిమంతమైన దేశమని, కాల పరీక్షలో తమ పక్షాన నిలబడ్డ గొప్ప మిత్రుడని పుతిన్‌ కొనియాడారు. ఉగ్రవాదం, డ్రగ్స్‌ అక్రమ రవాణా ఇరు దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్లని చెప్పారు. అఫ్ఘానిస్థాన్‌ ఇస్లామిక్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారకుండా చర్యలు తీసుకొనేందుకు భారత్‌తో కలిసి పని చేస్తామని పుతిన్‌ అన్నారు.

రక్షణ రంగంలో 4 ఒప్పందాలు భారత్‌-రష్యా దేశాలు కుదుర్చుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలో 5వేల 124 కోట్లతో ఏర్పాటు చేసిన ఆయుధ కర్మాగారంలో.. ఆరు లక్షల ఏకే 203 రైఫిళ్ల తయారీ, శత్రు లక్ష్యాల నాశనం కోసం రష్యా నుంచి 11వేల 262 కోట్లతో గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. శత్రు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చేందుకు ఉపయోగించే ఇగ్లా-ఎస్‌ విమాన విధ్వంసక క్షిపణులను రష్యా నుంచి భారత్ సమీకరించనుంది.

Tags:    

Similar News