Russia Coronavirus Vaccine: ప్రపంచ దేశాలకు రష్యా శుభవార్త
Russia Coronavirus Vaccine: చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తుంది. ఈ తరుణంలో వ్యాక్సిన్ తయారీకి శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Russia Coronavirus Vaccine: చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తుంది. ఈ తరుణంలో వ్యాక్సిన్ తయారీకి శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అమెరికా, చైనా, భారత్, రష్యా దేశాలు తామే ముందుగా వ్యాక్సిన్‌ను కనిపెట్టి, మార్కెట్‌లోకి విడుదల చేయాలని తీవ్ర పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు రష్యా శుభవార్త తెలిపింది. తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను ఆగస్ట్ 10లోపు విడుదల చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశామని ప్రకటన చేసింది. ముందుగా ఈ వ్యాక్సిన్ ను వైరస్ బారినపడిన వైద్యులకు మొదట సరఫరా చేసి, ఆ తరువాత ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని గురువారం ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించారు. సెషనోవ్ వర్సిటీ అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ తుది ప్రయోగాలను పూర్తి చేసుకునే దశలో ఉందని శాస్త్రవేత్తలు ప్రకటన చేసారు. రష్యాలోని సెషనోవ్ వర్సిటీ తయారు చేసిన టీకా ప్రపంచంలోనే తొలి కరోనా నిరోధక టీకా అన్న ఇటీవల కాలంలో వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న టీకా సైతం ఆగస్ట్ మూడో వారంలో సిద్ధమైయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్ అంచనా వేస్తుంది.
మరోవైపు అమెరికా సంస్థ 'మోడెర్నా' కూడా గుడ్ న్యూస్ చెప్పింది. 'ఎంఆర్‌ఎన్‌ఏ1273'గా పిలిచే ఈ వ్యాక్సిన్ తొలి దశ ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చినట్లు ఇప్పటికే తేలింది. దీంతో అమెరికా సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడో దశ క్లినియల్ ట్రయల్స్ ప్రారంభించారు. వైరస్‌ను నిర్వీర్యం చేసే బలిష్టమైన ప్రతిస్పందన వ్యవస్థను ఈ వ్యాక్సిన్ సృష్టించిందని మోడెర్నా సంస్థ తెలిపింది. అంతే కాదు కోతుల్లో కరోనా వైరస్ ను ఈ వ్యాక్సిన్ నిలువరించగలుగుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడయ్యిందని కూడా ప్రకటించింది. కోతుల్లోని దిగువ, ఎగువ శ్వాసనాళాల్లో కరోనాను నియంత్రించిందని పేర్కొంది. ఈ సంస్థ తాజాగా చేసిన అధ్యయనం ప్రకారమే వ్యాక్సిన్ పనితీరును ధ్రువీకరించింది. కరోనా బారిన పడి కోలుకున్న వారిలో ఉత్పన్నమవుతున్న యాంటీబాడీలతో పోలిస్తే వ్యాక్సిన్ పొందిన కోతుల్లోనే అధిక సంఖ్యలో యాంటీబాడీలు ఉత్పత్తయినట్లు నిర్ధరించారు.