Delhi: ఢిల్లీలో తాగునీటి కష్టాలు.. ఇకపై అలా చేస్తే రూ.2 వేలు ఫైన్
ఢిల్లీలో కనీస అవసరాలకు నీళ్లు లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Delhi Water Crisis: దేశ రాజధాని ఢిల్లీని నీటి కష్టాలు వెంబడిస్తున్నాయి. ఢిల్లీలో కనీస అవసరాలకు నీళ్లు లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హర్యానా నుంచి యమునా నీటి విడుదల లేకపోవడం ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది.
ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నీటిని వృథా చేస్తూ పట్టుబడిన వ్యక్తులకు 2 వేల రూపాయల జరిమానా విధించింది. కార్లను కడగడం, ట్యాంకులు ఓవర్ ఫ్లో చేయడం, నిర్మాణం కోసం గృహ నీటి సరఫరాను ఉపయోగించడం వంటి వాటిని అరికట్టేందుకు ఢిల్లీ అంతటా 200 బృందాలను నియమించాలని ఢిల్లీ ప్రభుత్వం జల్ బోర్డును కోరింది.
ఢిల్లీలోని చాణిక్యపురి సంజయ్ క్యాంపు ప్రాంతంలో నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నారు. డ్రమ్ములు వాటర్ క్యాన్‌లు, పైపులు పట్టుకుని రోడ్డుపై ట్యాంకర్ కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో వాటర్ ట్యాంక్ రాగా దాని పట్టుకుని వేలాడుతూ..బతుకు జీవుడా అంటూ...తమ వద్దనున్న పైపులను నీటి ట్యాంకర్‌లో వేసి తమ వద్దనున్న డ్రమ్ములు, క్యాన్‌లల్లో నీటిని నింపుకున్నారు.