Riots in Bangalore : ఉద్యాన నగరి బెంగళూరు ఒక్కసారిగా భగ్గుమంది. బెంగళూరు తూర్పు ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. రాత్రంతా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. కాంగ్రెస్ శాసన సభ్యుడి ఇంటిపై ఒక వర్గానికి చెందిన వారు మూకుమ్మడిగా దాడి చేశారు. బెంగళూరులో చోటు చేసుకున్న అల్లర్లలో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. అయితే ఈ సంఘటనపై నగర కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ సామాజిక మాధ్యమంలో చేసిన ఓ పోస్ట్ ఈ అల్లర్లకు దారి తీసిందని ఆయన అన్నారు. అయితే ఒక వర్గానికి చెందిన కొందరు ఫిర్యాదు నవీన్ ను అరెస్ట్ చేయలంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిని తగులబెట్టడం, దానికి అనుబంధంగా కేజీ హళ్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడి వాహనాలను నిప్పంటించిన ఘటనలో ఇప్పటిదాకా పోలీసులు 110 మందిని అరెస్టు చేశామని తెలిపారు. మరి కొందరిని అరెస్టు చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేసారు. కేజీ హళ్లి పోలీస్ స్టేషన్, అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిపై దాడి చేసిన వారిని గుర్తిస్తున్నామ్. ప్రస్తుతం పరిస్థితుల్లో అదుపులోనే ఉన్నాయి. స్థానికులు శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు.
అఖండ శ్రీనివాస మూర్తి నివాసం ఉంటోన్న కావల్ బైరసంద్రతో పాటు కేజీ హళ్లి, బాణసవాడి, నాగవార, వినోభా నగర్, కాడుగొండనహళ్లిల్లో 144 సెక్షన్ కొనసాగుతోందన్నారు. డీజే హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. అల్లర్లను నియంత్రించడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని ఆయన తెలిపారు. కేజీ హళ్లి పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దాడి లో ఘటనలో 60 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో అఖండ శ్రీనివాస మూర్తి ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. ప్రజలు శాంతిని, సంయమనాన్ని పాటించాలని శ్రీనివాస మూర్తి విజ్ఙప్తి చేశారు. ఘటనకు కారణమైన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.