Delhi: గణతంత్ర వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబు
Delhi: మంచు దుప్పటిలో కొనసాగుతున్న పరేడ్ రిహార్సల్స్
Delhi: దేశరాజధాని ఢిల్లీ గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతోంది. మరో రెండు రోజుల్లో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీలో రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ ప్రత్యేక బలగాల బృందం, సీనియర్ ఇండియన్ ఆర్మీతో పాటు పారామిలటరీ సిబ్బంది కలిసి రిహార్సల్స్ చేస్తూనే ఉన్నారు. దేశానికి స్వాతంత్ర్యం పొందిన 75వ సంవత్సరంలో భాగంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ గా జరుపుకుంటున్నారు.
కరోనా ఆంక్షల నేపథ్యంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగుతున్నందున కేవలం 24 వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు. వారిలో 19 వేల మంది ఆహ్వానితులు హాజరు కానున్నారు. జనవరి 26న రాజ్ పథ్ లో జరిగే రిపబ్లిక్ డే, జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెబుతున్నారు. వేడుక ముగింపును సూచించే సాంప్రదాయ ఫ్లై-పాస్ట్‌లో 75 విమానాలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. వింటేజ్‌తో పాటు రాఫెల్, సుఖోయ్, జాగ్వార్, ఎంఐ-17, సారంగ్, అపాచీ, డకోటా వంటి ఆధునిక విమానాలను ప్రదర్శించనున్నారు. ఫ్లై-పాస్ట్ లో విమానాలు లేదా హెలికాప్టర్ల ద్వారా 15 వేర్వేరు రూపాలను ప్రదర్శించనున్నారు.