Uttar Pradesh: యూపీలో 53,942 మైకుల తొలగింపు

Uttar Pradesh: నిబంధనలకు అనుగుణంగా ఆలయాలపై... 60,295 స్పీకర్లు ఉన్నట్టు వెల్లడి

Update: 2022-05-01 14:30 GMT

Uttar Pradesh: యూపీలో 53,942 మైకుల తొలగింపు

Uttar Pradesh: దేశంలో లౌడ్ స్పీకర్ల వివాదం కొనసాగుతోంది. యూపీలో హనుమాన్‌ చాలీసా వివాదానికి కూడా ఈ లౌడ్‌ స్పీకర్లే కారణం. ఇప్పటికే లౌడ్‌ స్పీకర్లను నిషేధిస్తూ యూపీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా యూపీలో తొలగించిన లౌడ్‌ స్పీకర్ల వివరాలను ఆ రాష్ట్ర లా అండ్‌ ఆర్డర్‌ విభాగం ఏడీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ వివరాలను వెల్లడించారు. యూపీలో ఇప్పటివరకు అన్ని వర్గాల మందిరాలపై ఉన్న అనుమతిలేని 53వేల 942 లౌడ్‌ స్పీకర్లను తొలగించినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రార్థనా మందిరాలపై 60వేల 295 మైకులకు అనుమతి ఉన్నట్టు ఏడీజీపీ తెలిపారు. అనుమతిలేని మైకులపై ఆయా మతాల పెద్దలతో మాట్లాడి తొలగించినట్టు ప్రశాంత్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

అనుమతిలేని, నిబంధనలకు విరుద్ధంగా ఆయా మతాల మందిరాలపై ఏర్పాటు చేసిన మైకులను తొలగించాలని ఆదేశిస్తూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ఏప్రిల్‌ 24న ఆదేశాలు జారీ చేశారు. నాటి నుంచి మైకుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మహారాష్ట్రలో మైకులను మే 3లోగా తొలగించాలని సీఎం ఉద్దవ్‌ థాక్రే సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన-ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ థాక్రే అల్టిమేటం జారీ చేశారు. మసీదుల్లో ఆజాన్‌ వినిపిస్తే తాము ఆలయాల్లో అనుమాన్‌ చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో సీఎం ఉద్దవ్‌ థాక్రే నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్‌ చాలీసా పఠిస్తామని అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణా హెచ్చరించారు. వారి వ్యాఖ్యలతో శివసైనికులు రెచ్చిపోయారు. నవనీత్‌ కౌర్‌ ఇంటిని ముట్టడించారు. దీంతో ముంబైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అనవసరమైన అంశాలకు మతం రంగు పులుముతున్నారని లౌడ్‌ స్పీకర్ల వివాదాన్ని ఉద్దేశించి ఆర్జేడీ చీఫ్‌, బీహార్ ప్రతిపక్ష నేత తేజశ్వీ యాదవ్‌ ఆరోపించారు. 1970 నుంచి మసీదుల్లో, ఆలయాల్లో వాడుతున్నారని అక్కడ స్పీకర్లు లేకపోతే దేవుడు కూడా లేనట్టేనన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో పాటు రైతులు, కార్మికుల పరిస్థితిపై ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. లౌడ్‌ స్పీకర్లు, బుల్డోజర్లపై చర్చ దేశానికి అవసరమా? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేది కాదా? అని ప్రశ్నించారు. కొందరు నేతలు వాస్తవ అంశాలకు దూరంగా వెళ్తున్నారని తేజస్వీ యాదవ్ ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. 

Tags:    

Similar News