Bhadradri Kothagudem: ఎర్ర చీమల పచ్చడి.. వేసవిలో ఆదివాసీల ఆహారం..
Bhadradri Kothagudem: ఇక్కడ దొరికే వాటితోనే జీవనం సాగిస్తున్న గిరిజనులు
Bhadradri Kothagudem: వేసవి వచ్చిందంటే చాలు.. అందరూ నోరూరించే పచ్చళ్ళు తయారు చేస్తుంటారు.. ఆవకాయ, నిమ్మకాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, గోంగూర లాంటి పచ్చడిల గురించి మనకు తెలుసు..కానీ ఎర్ర చీమలతో పచ్చడి చేసుకుని పిల్లలు నుండి వృద్ధుల వరకు ఎంతో ఇష్టంగా లొట్టలు వేసుకోవడం మీరు విన్నారా... ఇది భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్లమండలంలోని కొండివాయిలో గిరిజనులకు అలవాటు.
తెలంగాణ- ఛత్తీస్ ఘఢ్ సరిహద్దు ప్రాంతంలోని కొండివాయిలో గత 40 సంవత్సరాల క్రితం చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఆదివాసీలు ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని తమ జీవనం కొనసాగిస్తున్నారు..రాగి జావా, జొన్న జావా, కొర్ర జావా తో పాటు అటవీ ప్రాంతంలోని చెట్లకు ఉన్న ఎర్ర చీమల పుట్టతో చేసే పచ్చడని ఆహారంగా తీసుకుంటారు. వారి దృష్టిలో ఈ ఆహారం నాన్ వెజ్ కాకపోవడం విశేషం.. దానికోసం ఆదివాసీ మహిళలు ప్రతిరోజు అడవిలోకి వెళ్లి, ఎత్తైన చెట్ల చెట్లను ఎక్కి లేదా పొడవైన ఎదురు బొంగులతో చీమలు పెట్టిన పుట్టలను కోసుకొని, వాటిని తమ గ్రామంలోకి తెచ్చి, ఆ చీమలను రోటిలో వేసి, దాంట్లో ఉప్పు కారం వేసి దంచుతారు.. అలా తయారు చేసిన ఆ చీమల పచ్చడి పిల్లల నుంచి పండు ముసలి వరకు జొన్న అన్నంలో కలుపుకొని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
మైదాన ప్రాంతానికి సుదూర దూరంలో, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు తెల్లవారుజామున లేచి ఇప్పపువ్వు , తునికాకు సేకరణ చేస్తుంటారు. పశువులను మేపడమే వీరి ప్రధాన వృత్తి. వేసవికాలం కావడంతో వ్యవసాయ పనులు లేక ఆదాయ మార్గాలు లేక ఆహారం కోసం అలమటిస్తుంటారు. దీంతో వీరికి అడవిలో దొరికే చీమలు, అటవీ సంపదే వారి ఆహారంగా మారుతోంది. అడవిలో దొరికే ఎర్ర చీమలను తినడం అనేది వాళ్ల పూర్వీకుల నుంచి ఇప్పటి తరం వరకు అలవాటుగా మారిందని, చీమల పచ్చడి అనేది తమ ఆహారపు అలవాటులో ఒక భాగం అని, వీటిని తినడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నామంటున్నారు. తమకు ఎలాంటి రోగాలు లేవని తెలుపుతున్నారు.