Coronavirus Control: కరోనా కట్టడిలో కేరళ.. ఢిల్లీ ముందువరుసలో! ఎందుకు?

Coronavirus Control: ఒక విధంగా చెప్పాలంటే మొదటి కరోనా కేసు నమోదయింది కేరళలో..

Update: 2020-07-28 04:00 GMT

Coronavirus Control: ఒక విధంగా చెప్పాలంటే మొదటి కరోనా కేసు నమోదయింది కేరళలో.. దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యింది ఢిల్లీలోనే. అయినా కరోనా కట్టడి విషయంలో ఆ రెండు ఎందుకు ప్రస్తుతం ముందంజలో ఉన్నాయి. వీటికి సంబంధించి వివిధ కారణాలు విశ్లేషిస్తున్నారు మేధావి వర్గాలు. అవి అనుసరించిన బాటలోనే పయనిస్తే మిగిలిన రాష్ట్రాలు సైతం కట్టడి చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.

వారికి ఎలాంటి వ్యాపారాలు లేవు. ఎలాంటి లాబీయింగ్ లతో వారికి పని లేదు. ఏ కాంట్రాక్టర్ నుంచి వారికి డబ్బులు అవసరం లేదు. ఏది జరిగినా., ఆగినా.. వారి ఆదాయం ఏమీ మారదు. ఎవరి వ్యాపారంజరిగినా..జరగకపోయినా.. వీరికేమీ కమీషన్లు రావు. ప్రభుత్వ కార్యక్రమాలకు, వారి రాజకీయ అజెండాకు సంబంధం లేదు. అందుకే ఏ కార్యక్రమం ఆపినా.. వారి రాజకీయం ఏమీ మారిపోదు. ఏ విధానం చేపట్టాలో ఏ కార్పొరేట్ కంపెనీ వారికి డైరెక్షన్ ఇవ్వదు. ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ మల్టీ నేషనల్ కంపెనీ వారిని ఇన్ ఫ్లూయెన్స్ చేయలేదు. కాలేజీలు, ఆస్పత్రులతో వారికి పబ్లిక్ సర్వీస్ తప్ప .. వేరే రికమెండేషన్ పనులేమీ ఉండవు. అందుకే వారిద్దరూ సక్సెస్ అయ్యారు. కరోనాను కంట్రోల్ చేయడంలో.. వారు పై చేయి సాధించారు. కేసులు పెరుగుతున్న కొద్దీ.. ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయాలో.. అదే అమలు చేశారు. అందుకే ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఊపిరి తీసుకోగలుగుతున్నారు. అవి ఒకటి కేరళ.. ఇప్పుడు రెండోది ఢిల్లీ. ఒకరు కేరళ ముఖ్యమంత్రి విజయన్.. రెండోవారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఢిల్లీలో సైతం ఇప్పుడు రికవరీ రేటు 85 శాతం దాటిపోవడంతో.. కేజ్రీవాల్ చేపట్టిన కరోనా ఆపరేషన్ మంచి ఫలితాలనే ఇచ్చినట్లయింది.

మిగతా రాష్ట్రాలలాగా వారి దగ్గర ప్రభుత్వ ఆస్పత్రులు వీక్ గా లేవు. కేరళలో ఎప్పటి నుంచో సంప్రదాయకంగా ప్రభుత్వ ఆస్పత్రులు బలంగా ఉన్నాయి. కేజ్రీవాల్ అయితే మొదటి టర్మ్ లో ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి.. రెండో టర్మ్ లో ప్రభుత్వ ఆస్పత్రులపైనే దృష్టి పెట్టారు. అది ఇప్పుడు కరోనా సమయంలో ఉపయోగపడింది. అలాగే వారెక్కడా లాక్ డౌన్ ను సడలించి.. వ్యాపారస్తులకు మేలు చేయాలని చూడలేదు. లాక్ డౌన్ ను అన్ లాక్ చేయడానికి తొందరపడలేదు. మద్యం షాపులు ఓపెన్ చేయాలని ఆత్రపడలేదు. ఆ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు అని.. ఆ ల్యాండ్ కేటాయింపులు.. ఈ ల్యాండ్ అమ్మకాలు అని విపరీతంగా అధికారులతో మీటింగులు పెట్టలేదు.. ఎందుకంటే వారికి కమీషన్ల మీద ఆశ లేదు. కేవలం పబ్లిక్ ఇబ్బంది పడకుండా ఉండటానికి ఏం చేయాలి… కరోనా కట్టడికి ఏం చేయాలనేదానిపైనే వారు దృష్టి పెట్టారు. అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయి.

దీనికి విరుద్ధంగా రాజకీయ నాయకులంతా తమ తమ పనులు పూర్తి చేసుకోవడానికి, వ్యాపారాలు నడుపుకోవడానికి.. కమీషన్లు రాబట్టుకోవడానికి.. ప్రభుత్వ భూములు అప్పనంగా తీసుకోవడానికి ఏం చేశారో.. ఎన్ని మీటింగులు పెట్టుకుంటున్నారో.. ఎలా తిరిగారో.. ఎంతమంది కరోనా బారిన పడ్డారో.. ఎంతమందికి అంటించారో.. చివరకు ఆయా రాష్ట్రాల్లో పరిస్ధితి ఏంటో చూస్తూనే ఉన్నాం. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే ధ్యేయంగా, ప్రధాన అజెండాగా పని చేసే ప్రభుత్వాలు కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలలాగే ఉంటాయి. పైకి సంక్షేమ పథకాలు పెట్టి.. వెనక తమ తమ ఆదాయాలు, ఆస్తులు పెంచుకోవడానికి పని చేసే రాజకీయ పార్టీలున్న చోట్ల.. ఫలితాలు ఎలా ఉంటాయో కూడా మనం చూస్తున్నాం. ప్రజలు ఇప్పటికైనా.. పార్టీలు, నాయకుల విధానాలపైన ఫోకస్ పెట్టాలని ఆశిద్దాం. 

Tags:    

Similar News