Ratan Tata's Last Rites: పార్సి సంప్రదాయాల ప్రకారం రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి
Ratan Tata's Last Rites: మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య రతన్ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి. పార్సిల సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు పూర్తిచేసినట్లు పార్సి మత పెద్ద తెలిపారు. ముంబైలోని కొలబాలో ఉన్న రతన్ టాటా నివాసంలో మరో మూడు రోజుల పాటు కర్మకాండలు కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం తరపున హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడికి చేరుకుని రతన్ టాటాకు అంతిమ నివాళి అర్పించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ కూడా ఉన్నారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా రతన్ టాటా పార్థివ దేహానికి అంతిమ నివాళి అర్పించారు.
అంతకంటే ముందుగా రతన్ టాటా పార్థివదేహాన్ని ప్రజలు, వీఐపీల సందర్శనార్ధం ఇవాళ ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు ముంబైలోని నారిమన్ పాయింట్‌లో ఉంచారు. అనంతరం అక్కడి నుండి వొర్లిలోని స్మశానవాటిక వరకు రతన్ టాటా అంతిమ యాత్ర కొనసాగింది.
దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముంబైకి చేరుకుని రతన్ టాటా పార్థివదేహం ఎదుట పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. రతన్ టాటా మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రముఖులు.. ఆయన మృతి దేశానికి తీరని లోటుగా అభివర్ణించారు. రతన్ టాటా మృతి నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ సంతాపదినంగా ప్రకటించాయి. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని విశ్వసించే అతికొద్దిమందిలో రతన్ టాటా ఒకరు. ఆయన లేని లోటు తీరనిదని పేర్కొంటూ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.