Rapid Antigen Tests: కొంపముంచుతున్న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు.. యధాతధంగా తిరిగేస్తున్న లక్షణాలున్న వ్యక్తులు
Rapid Antigen Tests | ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా దాదాపు ఖరారు కాదని, లక్షణాలుంటే ఆర్ టీ పీసీఆర్ టెస్టుకు వెళ్లాలని ఐసీఎంఆర్
Rapid Antigen Tests | ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా దాదాపు ఖరారు కాదని, లక్షణాలుంటే ఆర్ టీ పీసీఆర్ టెస్టుకు వెళ్లాలని ఐసీఎంఆర్ చెబుతున్నా, రోగులు పట్టించుకోవడం లేదు. ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని లక్షణాలున్న రోగులు తిరిగడం ద్వారా ఈ వ్యాధిని మరింత వ్యాప్తి చేసేందుకు దోహదం చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి, రోగలక్షణాలున్న వ్యక్తులు ఆర్టీ పీసీఆర్ చేయిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని చెబతున్నారు.
ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో ఉన్న సమస్యే ఇది. ఈ టెస్టుల్లో పాజిటివ్ వస్తే 99.3% నుంచి 100% ఓకే. నెగెటివ్ వస్తే 50.6% నుంచి 84% మాత్రమే కరెక్ట్ అని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పష్టంచేసింది. మిగిలిన నెగెటివ్‌లన్నీ నెగెటివ్‌లుగా గుర్తించలేమంది. యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ కచ్చితత్వమే అసలు సమస్య. అందువల్ల యాంటిజెన్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చి ఏమాత్రం లక్షణాలున్నా ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష తప్పక చేసుకోవాలని ఐసీఎంఆర్ చెబుతోంది. అంతేకాదు లక్షణాల్లేకుండా యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చినా, ఆ తర్వాత లక్షణాలు కనిపిస్తే అప్పుడు మళ్లీ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. కానీ రాష్ట్రంలో చాలామంది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగెటివ్ రాగానే కులాసాగా తిరిగేస్తున్నారు. ఈ విషయంలో కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితే వైరస్ సామాజిక వ్యాప్తికి దారితీస్తోంది.
70 శాతం యాంటిజెన్ టెస్టులే
ఇప్పటివరకు రాష్ట్రంలో 16.67 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 1,38,395 మందికి కరోనా సోకినట్లు తేలింది. మొదట్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఆపై ప్రైవేట్‌లోనూ ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షల ద్వారానే కరోనా నిర్ధారణ జరిగింది. అయితే, ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షల్లో భాగంగా శ్వాబ్ నమూనాలు తీయడం, వాటిని భద్రంగా లేబొరేటరీలకు పంపడం ప్రహసనంగా మారింది. చివరకు టెస్ట్ ఫలితం రావడానికి రెండు నుంచి ఏడు రోజుల వరకు పడుతోంది. ఫలితం వచ్చేలోగా బాధితుల్లో వైరస్ ముదిరిపోయి పరిస్థితి తలకిందులయ్యేది. దీంతో రెండు నెలలుగా రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు సర్కార్ శ్రీకారం చుట్టింది. శ్వాబ్ తీసిన వెంటనే అక్కడికక్కడే పరీక్ష జరగడం, పావుగంట నుంచి అరగంటలోనే ఫలితం రావడంతో బాధితులకు ఊరటనిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో చేసిన మొత్తం పరీక్షల్లో 70 శాతం, రోజువారీ పరీక్షల్లో 90 శాతం యాంటిజెన్ పరీక్షలేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారికి తక్షణ చికిత్సకు ఈ టెస్టులు వీలు కల్పించాయి.
నెగెటివ్ వచ్చి లక్షణాలున్నవారిపై నిర్లక్ష్యం
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,076 చోట్ల యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. కొన్నిచోట్ల అనుమతి లేకున్నా ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆసుపత్రులు కూడా యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నాయి. అయితే నెగెటివ్ వచ్చినా లక్షణాలుంటే ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష చేసుకోవాలన్న ఐసీఎంఆర్ నిబంధనను పలుచోట్ల కాలరాస్తున్నారు. కిందిస్థాయిలో వైద్యారోగ్య యంత్రాంగం కూడా ఇది మర్చిపోయింది. బాధితులు కూడా లక్షణాలున్నా యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ రావడంతో ఆనందపడిపోతున్నారు. ఇదే కొంపముంచుతోంది.
కొందరిలో వైరస్ తీవ్రం కావడంతో పాటు వారి కుటుంబసభ్యులకూ సోకుతోంది. ఉన్నతస్థాయిలోని వ్యక్తులు కూడా యాంటిజెన్ టెస్టుల నెగెటివ్ రిపోర్ట్‌ను పూర్తిగా నమ్మేస్తున్నారు. ఉదాహరణకు ఒక మీటింగ్ ఏర్పాటుకు ముందు అందరికీ యాంటిజెన్ టెస్టులు చేసి నెగెటివ్ వచ్చిన వారందరినీ హాలులోకి అనుమతించారనుకోండి. అలా నెగెటివ్ వచ్చిన వారిలో లక్షణాలున్నవారు ఎవరైనా ఉంటే, వారి వల్ల ఆ మీటింగ్‌లో ఉన్న ఇతరులకూ వైరస్ సోకుతుంది. ఇలా వైరస్ సామాజిక వ్యాప్తికి విస్తరిస్తుందని ఒక వైద్య నిపుణుడు వివరించారు